విలక్షణ నటుడు కమల్ హాసన్ తమిళ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారా.. అంటే కమల్ పొలిటికల్ పార్టీ పెట్టకముందే తన మాటలకు పదును పెడుతన్న తీరు చూస్తే అవుననే అనిపిస్తుంది. ఇప్పుడే ఇలా వుంటే ఇక రాజకీయ పార్టీ స్థాపిస్తే ఇంకెన్ని విమర్శలకు దిగుతాడోనని అధికార బీజేపీ నాయకులు బెంబేలెత్తిపోతున్నారు. వాళ్లను మరింత ఇరకాటంలో నెడుతూ ఎప్పటికప్పుడు వివాదాల్ని సృష్టిస్తూనే ఉన్నాడు కమల్. తాజాగా హిందూ తీవ్రవాదులు అంటూ  కమల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

 

తన వ్యాఖ్యలతో ఇప్పటికే అటు కేంద్రాన్ని, ఇటు తమిళనాడు రాజకీయాల్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నారు కమల్. మొన్నటికిమొన్న విజయ్ నటించిన మెర్సల్ సినిమాకు మద్దతుతెలిపి అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయానికి గతంలో మద్దతు తెలిపి పెద్ద తప్పుచేశానంటూ మరో కామెంట్ కూడా చేశారు. డెంగ్యూ వ్యాధిని అరికట్టే ఆయుర్వేద కషాయంపై కూడా వివాదాస్పాద వ్యాఖ్యలు చేసి కేంద్రాన్ని, తమిళ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేశారు.

 

మొన్నటివరకు హిందూ తీవ్రవాదులు మాటలకే పరిమితమయ్యేవారు. కానీ వాళ్లు కూడా హింసకు పాల్పడుతున్నారు. వీళ్లను చూసిన తర్వాత సత్యమేవ జయతే పట్ల ప్రజలకు నమ్మకం పోయింది. బలప్రయోగమే గెలుస్తుందని నమ్ముతున్నారు. ప్రస్తుతం సమాజంలో హిందూ టెర్రర్ ఉంది.” కమల్ తాజా వ్యాఖ్యలివి. ప్రస్తుతం ఈ వ్యాఖ్యల్ని బీజేపీ నాయకులు ఒక్కొక్కరిగా ఖండిస్తున్నారు.

 

తను కాషాయవాదిని కాదని కొన్ని రోజుల కిందటే ప్రకటించిన కమల్.. తాజా వ్యాఖ్యలతో మరింత క్లారిటీ ఇచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా తను పనిచేయబోతున్నానని కమల్ తాజా వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి. మరో 5 రోజుల్లో రాబోతున్న తన పుట్టినరోజు సందర్భంగా కమల్ తమిళనాడులో కొత్త పార్టీని ప్రకటించబోతున్నారు.