ఒకే రూపంలో ఉన్న ముగ్గురు వ్య‌క్తుల క‌థ‌తో ద‌ర్శ‌కుడు రాజేంద్ర‌రెడ్డి అమిగోస్‌ సినిమాను తెర‌కెక్కించారు. 


కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్ మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కళ్యాణ్ రామ్ గతంలో నటించిన బింబిసార సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని అందరూ అంచనాలు వేశారు. కానీ డివైడ్ టాక్ రావటంతో కలెక్షన్స్ వసూళ్లయితే భారీగా కనిపించడం లేదు. వీకెండ్ ని కూడా విజయవంతంగా దాటే పరిస్దితి లేదు. రెండో రోజుకే ఈ చిత్రం కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయ్యాయి. మొదటి రోజు రెండు కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఈ సినిమా రెండో రోజు కోటి ప‌ది ల‌క్ష‌ల వ‌సూళ్ల‌ను మాత్ర‌మే ద‌క్కించుకుని షాక్ ఇచ్చింది. ఆదివారం నాడు అయినా పికప్ అవుతుంది అనుకుంటే అదీ కనిపించటం లేదు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 11 కోట్ల వ‌ర‌కు జ‌రిగిన‌ట్లు స‌మాచారం. బ్రేక్ ఈవెన్ కావాలంటే మ‌రో ఏడు కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రావాల్సి ఉన్న‌ట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా అంత వసూళ్లు రాబట్టడం అనేది కష్టమే. నిజానికి బింబిసార విషయానికి వస్తే మొదటి రోజే ఆరు కోట్ల 30 లక్షలు రెండో రోజు నాలుగు కోట్ల 52 లక్షలు వసూలు చేయగా రెండు రోజుల్లోనే 11 కోట్ల వరకు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టింది. కానీ అమిగోస్ పరిస్థితి ఇప్పుడు పూర్తి భిన్నంగా ఉంది.

చిత్రం కథేమిటంటే... తన కుటుంబం నుంచి వచ్చిన బిజినెస్ ని హాయిగా ,కూల్ గా చేసుకునే సిద్ధార్థ్‌ (కల్యాణ్‌రామ్‌) ...రేడియో జాకీగా పని చేసే ఇషికా (ఆషికా రంగనాథ్‌) తో ప్రేమలో పడతారు. ఆ తర్వాత ఆమెను మెప్పించానికి తిప్పలు పడతాడు. కానీ అవేమీ ముందుకు వెళ్లవు. అదే టైమ్ లో ఓ ప్రెండ్ ద్వారా సిద్ధార్థ్‌ డోపెల్‌గ్యాంగర్ అనే వెబ్ సైట్ పరిచయం అయ్యి..తనలాగే మరో ఇద్దరు మంజునాథ్, మైఖేల్‌ ఉన్నారని తెలుసుకుని వాళ్లతో టచ్ లోకి వెళ్తాడు. గోవాలో సిద్దార్ వాళ్లను కలుసుకుంటాడు. తక్కువ టైమ్ లోనే క్లోజ్ అవుతారు. అలాగే మంజు, మైఖేల్‌ సాయంతో సిద్ధార్థ్‌ తన ప్రేమను పెళ్లి పట్టాలెక్కిస్తాడు. ఆ తర్వాత ఎవరు ఊరికి వారు బయిలుదేరతారు. కానీ అనుకోని విధంగా నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ ఆఫీసర్స్.. మంజునాథ్‌పై కాల్పులు జరిపి.. అతన్ని తమ కస్టడీలోకి తీసుకుంటారు. అప్పుడే సిద్ధార్థ్‌కు మైఖేల్‌ గురించి ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. మైఖేల్‌ ఓ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని, అతని పేరు బిపిన్‌ రాయ్‌ అని అర్దమవుతుంది. అలాగే.. అతడిని పట్టుకోవడం కోసమే ఎన్‌ఐఏ వాళ్లు హైదరాబాద్‌కు వచ్చారని కానీ ఒకే పోలికలతో ఉండటంతో బిపిన్‌ కావాలనే మంజుని ఇరికించి తప్పుకున్నాడని అర్దమవుతుంది. అలాగే తాను సమస్యల్లో చిక్కుకున్నట్లు గ్రహిస్తాడు. ఇంతకీ బిపిన్‌ రాయ్‌ ఎవరు? కావాలనే ఈ ఇద్దరి జీవితాల్లోకి అతను వచ్చాడా? బిపిన్ నుంచి వీరిద్దరూ ఎలా తప్పించుకున్నారు? అన్నది మిగతా కథ

మొదటే అనుకున్నట్లు పాయింట్ గా చాలా కొత్తగా అనిపించే ఈ కథ సరిగ్గా చేస్తే ఇంట్రస్టింగ్ గా నేఉండేది. కానీ పాయింట్ మాత్రమే కొత్తగా చూసుకుని మిగతాదందా పాత,రొటీన్ వ్యవహారంలోకి వెళ్లిపోయాడు డైరక్టర్. కథలోకి చాలా స్పీడుగా వెళ్లిన దర్శకుడు, అరే భలే కొత్తగా ఉందే అనిపించాడు. కానీ రాను రాను మెల్లిమెల్లిగా రొటీన్ లోకి జారిపోయాడు. ఇంట్రవెల్ ట్విస్ట్ సైతం ఊహించగలిగేలా చేసుకున్నాడు. సెకండాఫ్ లో బిపిన్ ప్లాష్ బ్యాక్ ఓపెన్ అయ్యాక ..ఇంకేమీ లేదనిపిస్తుంది. ఈ కథకు మరో యాంగిల్ అవసరం అనిపిస్తుంది. కేవలం హీరో,విలన్ కథగా చేసేయటంతో పెద్దగా కిక్ ఇవ్వదు. అలాగే విలన్, హీరో మధ్య జరిగే క్యాట్ అండ్ మౌస్ గేమ్ ని థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్, ఎత్తులు పైఎత్తులతో ఆసక్తికరంగా తీర్చదిద్దలేకపోయారు