సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'యూటర్న్' చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. అన్ని ఏరియాల నుండి ఈ సినిమాకి మంచి స్పందన వస్తుండడంతో చిత్రబృందం సక్సెస్ మీట్ ని నిర్వహించింది. ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఆమె ఈ వేడుకకి రావడం వెనుక ఓ కారణం ఉందట. కవితకి ఇద్దరు కుమారులు. ఒక అబ్బాయి ఆరో తరగతి.. మరో అబ్బాయి పదో తరగతి చదువుతున్నారు. వాళ్లిద్దరికీ సినిమా నచ్చడంతో ఇంటికి వెళ్లి తమ తల్లితో సినిమా గురించి గొప్పగా చెప్పారట.

వెంటనే ఆమె సమంతకి ఫోన్ చేసి అభినందించారట. ఆ తరువాత చిత్రబృందం ఆమెని సక్సెస్ మీట్ కి ఆహ్వానించడంతో ఆమె రావడానికి అంగీకరించింది. ప్రజలు యూటర్న్ తీసుకోవాలంటే భయపడే విధంగా దర్శకుడు పవన్ కుమార్ సినిమా తీశారని మెచ్చుకున్నారు. ఆమె ప్రారంభించిన హెల్మెట్ కార్యక్రమానికి కూడా ఇటువంటి భయపెట్టే ప్రయత్నం ఏదైనా చేస్తే బావుంటుందని చమత్కరించారు.

సమంత నటనని, ఆమె సామజిక సేవను ప్రశంసించారు. ప్రస్తుతం సమంత, చైతన్య సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యాయని.. ఈ రెండు సినిమాలూ బాగా నడుస్తున్నాయని అన్నారు.