ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణ వార్త విని కళాతపస్వీ కన్నీరు మున్నీరయ్యారు. బాలు తన ఆరోప్రాణమని చెబుతూ భావోద్వేగం చెందారు. బాలు శుక్రవారం మధ్యాహ్నం 1.04 నిమిషాలకు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కళాతపస్వీ .. బాలుకి సంతాపం చెబుతూ ఓ వీడియోని పంచుకున్నారు.

`భగవంతుడు ఇంతటి అన్యాయం చేస్తాడనుకోలేదు.. వాడు నా సోదరుడే కాదు.. నా ఆరో ప్రాణం. అలాంటిది ఇంతటి తొందరగా జరుగుతుందనుకోలేదు. ఆయన గురించి ఏం మాట్లాడాలో మాటలు రావడం లేదు. వాడి ఆత్మకి శాంతి చేకూర్చాలని, కుటుంబ సభ్యులకు ఓర్చుకునే శక్తినివ్వాలని కోరుకుంటున్నా`నని కళాతపస్వీ కె విశ్వనాథ్‌ కన్నీరు మున్నీరయ్యారు. 

కె. విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన దాదాపు అన్నిసినిమాలకు బాలు పాటలు పాడారు. `శంకరాభరణం`, `సాగర సంగమం`, `సప్తపది`, `స్వాతిముత్యం`,`శుభలేఖ`, `సిరివెన్నెల`, `స్వయంకృషి`, `స్వర్ణకమలం`, `ఆపద్భాంధవుడు`, `స్వరాభిషేకం`, `చిన్నబ్బాయి` వంటి చిత్రాల్లో ఎవర్‌ గ్రీన్‌ సాంగ్స్ బాలునే ఆలపించారు. ఇద్దరి మధ్య గొప్ప అనుబంధం ఉంది. 

ఓ సందర్భంలో బాలుని దర్శకత్వం వహించమని విశ్వనాథ్‌ అడగ్గా తాను అంతటి సాహసం చేయలేనని సున్నితంగా తిరస్కరించాడు బాలు. `శంకరాభరణం` చిత్రానికి నిర్మాతగానూ వ్యవహరించిన విషయం తెలిసిందే. తాజాగా బాలు లేడనే వార్తతో కె.విశ్వనాథ్‌ దుఖసాగరంలో మునిగిపోయారు.