ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం విడుదల... జూనియర్ ఎన్టీఆర్ గైర్హాజరు?
సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా నేడు ఆయన బొమ్మతో కూడిన 100 రూపాయల వెండి నాణెం విడుదల చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరవుతుండగా జూనియర్ ఎన్టీఆర్ వెళ్లడం లేదని సమాచారం...
తండ్రి ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని ఆయన ప్రతిమతో కూడిన వెండి నాణెం విడుదల చేయాలనీ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఆర్బీఐ కి సూచనలు ఇవ్వడం జరిగింది. నేడు రాష్ట్రపతి భవన్ వేడుకగా ఎన్టీఆర్ 100 రూపాయల వెండి నాణెం విడుదల చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను ఆహ్వానించడం జరిగింది. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతికి మాత్రం ఇన్విటేషన్ లేదు. దీంతో ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రపతి భవన్ నుండి ఆహ్వానం పొందినవారిలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు. అయితే ఈ కార్యక్రమానికి ఆయన హాజరుకావడం లేదని సమాచారం. దేవర షూటింగ్ లో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ వెళ్లలేదట. ఈ మేరకు సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. అధికారిక సమాచారం అయితే లేదు. హైదరాబాద్ వేదికగా జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు కూడా జూనియర్ ఎన్టీఆర్ రాలేదు. ఆ సమయంలో తన బర్త్ డే వేడుకల్లో భాగంగా ఆయన విదేశాలకు వెళ్లారు.
దీనిపై నందమూరి అభిమానుల్లోని ఓ వర్గం జూనియర్ ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారు. సోషల్ మీడియాలో జూనియర్ పై విమర్శలు గుప్పించారు. దీన్ని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తిప్పి కొట్టే ప్రయత్నం చేశారు. ఆయనకు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు 100 రూపాయల ఎన్టీఆర్ నాణెం విడుదల వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ హాజరు కానీ పక్షంలో మరోసారి సేమ్ సీన్ రిపీట్ అవుతుంది.
బాలయ్య మాత్రం హాజరవుతున్నట్లు సమాచారం. ఇక ఎన్టీఆర్ వెండి 100 రూపాయల నాణెం పరిశీలిస్తే... 44 మిల్లీ మీటర్లు చుట్టుకొలత కలిగి ఉంటుంది. 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5శాతం జింక్ తో రూపొందించారు. ఒకవైపు మూడు సింహాలతో కూడిన అశోక చక్రం ఉంటుంది. మరోవైపు ఎన్టీఆర్ బొమ్మ ఉంటుంది. ఎన్టీఆర్ శతజయంతి అని హిందీలో రాసి క్రింద 1923-2023 అనే సంవత్సరాలు ముద్రించి ఉంటాయి.