రోజు రోజుకీ సినిమా ..డిజిటల్ రూపం సంతరించుకుంటోంది. యూట్యూబ్ దానికి ఊతం ఇస్తోంది. ఈ నేఫధ్యంలో మొన్న మొన్నటిదాకా  షార్ట్ ఫిల్మ్స్ రాజ్యం ఏలాయి. అయితే మెల్లిమెల్లాగా అవి కుప్పలు తెప్పలు అయ్యి..వాటి ప్రాభవం కోల్పోయాయి. డిజిటల్ మీడియా వెబ్ సీరిస్ లు అంటూ అప్ డేట్ అయ్యింది. వెబ్ సీరిస్ లో మంచి ఆదాయం ఉందని ఇప్పుడు పెద్ద పెద్ద సినీ నిర్మాణ సంస్దలు సైతం అటు వైపుగా అడుగులు వేస్తున్నాయి. వారితో పాటే స్టార్స్ ని సైతం వెబ్ సీరిస్ లోకి తీసుకువస్తున్నారు. 

ఇప్పటికే తెలుగులో స్టార్ హీరో రానా వెబ్ సీరిస్ లోకి వచ్చి విజయం సాధించారు. నాగబాబు కుమార్తె నీహారిక ..ముద్దపప్పు..ఆవకాయ వెబ్ సీరిస్ తోనే వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత వరుణ్ సందేశ్ చిన్నా చితకా హీరోలు సైతం ఈ వెబ్ ప్రపంచంలో అడుగు పెట్టారు.

ఇదే కోవలో ఎన్టీఆర్ కూడా వెబ్ సీరిస్ లపై దృష్టి పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. మొన్నామధ్య టీవి ప్రపంచం లోకి వచ్చి బిగ్ బాస్ లో కనిపించిన ఎన్టీఆర్...వెబ్ సీరిస్ లతో యూత్ కు మరింత దగ్గర అవ్వచ్చు అని ఆలోచనలో ఉన్నారట. ముఖ్యంగా హిందీలో నవాజుద్దీన్ సిద్దిఖి, సైఫ్ అలీ ఖాన్, మనోజ్ వాజ్ పేయి, మాధవన్ వంటివారు వెబ్ ప్రపంపంలోకి అడుగుపెట్టడం ఎన్టీఆర్ ని ప్రేరేపించిందట.

అయితే తనలాంటి స్టార్ ని ప్రెజెంట్ చేసే కథ  ఉండాలి. డీల్ చేసే గొప్ప దర్శకుడు ఉండాలి. ఏదో ఆశామాషిగా ...వెబ్ సీరిస్ చేసేసి మమ అనిపించుకోవాలనే ఆలోచన లేదట. తాను కనుక చేస్తే జనం అలా వెబ్ కు అతుక్కుపోవాలి అంత గొప్పగా ఉండాలని..తనను సంప్రదిస్తున్న నిర్మాతలకు చెప్తున్నారట. మరి ఎన్టీఆర్ కోరిక తీరాలంటే ఎంత కాలం పడుతుందో చూడాలి.