ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆర్‌ఆర్ఆర్‌ సినిమా నుంచి టీజర్ వస్తుందని అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా రామ్‌ చరణ్ బర్త్‌ డే టీజర్ వచ్చిన తరువాత ఎన్టీఆర్ అభిమానులు ఆశలు మరింతగా ఎక్కువయ్యాయి. అయితే తాజాగా లాక్‌ డౌన్‌ పరిస్థితుల్లో టీజర్‌ను రిలీజ్ చేయలేకపోతున్నాం అని ఆర్ఆర్‌ఆర్‌ టీం అధికారికంగా వెల్లడించింది. దీంతో అభిమానులు ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో అభిమానులను సముదాయించేందుకు ఎన్టీఆర్ స్వయంగా ముందుకు వచ్చాడు. ఫ్యాన్స్‌ను ఉద్దేశిస్తూ ట్వీటర్‌ పేజ్‌లో ఓ ఎమోషనల్‌ మెసేజ్‌ను పోస్ట్ చేశాడు.

`ప్రియమైన అభిమాన సోదరులకు విన్నపం.. ఈ విపత్తు సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. అందరం కలిసి పోరాడితే ఈ సమస్య నుండి సురక్షితంగా బయటపడతాం అని నమ్ముతున్నాను. ప్రతీ ఏటా నా పుట్టిన రోజున మీరు చూపించే ప్రేమ చేసే కార్యక్రమాలు ఓ ఆశీర్వాదంగా భావిస్తాను. ఈ ఏడాది మాత్రం మీరు ఇంటి పట్టునే ఉంటూ, అధికారుల సూచనలను పాటిస్తూ, భౌతిక దూరానికి కట్టుబడి ఉండాలని నా విన్నపం. ఇదే మీరు నాకిచ్చే అతి విలువైన బహుమతి.

అలాగే, ఆర్‌ఆర్ఆర్‌ చిత్రం నుంచి ఈ సందర్భంగా ఎటువంటి ఫస్ట్‌ లుక్‌ లేదా టీజర్‌ విడుదల కావటం లేదు అనే విషయం మిమ్మల్ని తీవ్ర నిరాశకు గురించేసిందని నేను అర్థం చేసుకోగలను. ఫస్ట్ లుక్‌ లేదా టీజర్ మీ ఆనందం కోసం సిద్ధం చేయాలని చిత్ర బృంధం ఎంతగా కష్టపడింది నాకు తెలుసు. కానీ ఒక ప్రచార చిత్రం మీ ముందు ఉండాలి అంటే అన్ని సాంకేతిక విభాగాలు కలిసి శ్రమించాలి. అధికారిక ఆంక్షల వలన అది కుదరలేదు. రాజమౌళి గారి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం ఒక సంచలనం కలిగిస్తుంది అన్న నమ్మకం నాకు ఉంది. ఈ చిత్రం మిమ్మల్ని తప్పక అలరిస్తుంది. నా విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తూ.. మీ ఎన్టీఆర్‌` అంటూ ఓ ఎమోషనల్‌ మెసేజ్‌ను పోస్ట్ చేశాడు ఎన్టీఆర్.