యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు మాస్ ఆడియన్స్ లో భారీ ఎత్తున అభిమానులు ఉన్నారు. నటన, డైలాగ్ డెలివరీ, డాన్సులతో ఎన్టీఆర్ అభిమానులకు బాగా చేరువైన సంగతి తెలిసిందే. ప్రతి ఏటా ఎన్టీఆర్ జన్మదిన వేడుకల్ని ఆయన అభిమానులు ఘనంగా నిర్వహిస్తారు. ఎన్టీఆర్ కూడా కుటుంబ సభ్యులతో కలసి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటాడు. 

మే 20న ఎన్టీఆర్ 36వ పుట్టినరోజు. ఈసారి తన పుట్టినరోజున ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా ఎన్టీఆర్ దూరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దానికి కారణం హరికృష్ణ మరణం. గత ఏడాది ఆగష్టు 29న నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. హరికృష్ణ మృతి చెంది ఇంకా ఏడాది కూడా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో ఎలాంటి సంబరాలు జరుపుకోకూడదని ఎన్టీఆర్ భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు తెలియజేస్తున్నారు. 

ఎన్టీఆర్ పుట్టినరోజున ప్రతి ఏడాది అభిమానులు సెలెబ్రేట్ చేసుకుంటారు. తమ అభిమాన హీరో సంబరాలకు దూరం కాబోతున్నాడు కాబట్టి ఫ్యాన్స్ కూడా అలానే చేస్తారో లేదో చూడాలి. కానీ కొందరు ఎన్టీఆర్ అభిమానులు మాత్రం పుట్టినరోజున సేవ కార్యక్రమాలు నిర్వహించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు.