ఈ మధ్యకాలంలో ఓ కొత్త ట్రెండ్ మొదలైంది. మీడియం రేంజి హీరోల సినిమా పంక్షన్స్ కు సూపర్ స్టార్స్ వెళ్తున్నారు. దాంతో బజ్ బాగా క్రియేట్ అవుతోంది. అయితే ఆ స్టార్ హీరోని ఎవరు తీసుకువస్తారనేది ఎప్పుడు పెద్ద క్వచ్చిన్ మార్కే.  మెగా హీరోల సినిమాలకు  ఆ సమస్యలేదు. ఒక హీరో సినిమాకు మరో హీరో హాజరువుతూంటారు. సాయి ధరమ్ తేజ సినిమా ఈవెంట్ అంటే చిరంజీవి నుంచి అల్లు అర్జున్ దాకా అందరూ వస్తూంటారు. అయితే ఈ సారి వాళ్లెవరూ రావటం లేదు. జూ.ఎన్టీఆర్ రంగంలోకి దిగారు. ఎందుకలా జరుగుతోంది అంటే..

సాయితేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'చిత్రలహరి' . కల్యాణి ప్రియదర్శన్ .. నివేదా పేతురాజ్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాను ఏప్రిల్ 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ లోగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపడానికి మైత్రీ మూవీ మేకర్స్ వారు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ హాజరుకానున్నట్టు సమాచారం. 

'జనతా గ్యారేజ్' సమయం నుంచి మైత్రీ మూవీ మేకర్స్ వారికి ఎన్టీఆర్ తో మంచి సాన్నిహిత్యం వుండటంతో ఇది సాధ్యమైంది . నిర్మాతల ఆహ్వానం మేరకు ఎన్టీఆర్ రానున్నాడని అంటున్నారు. నిజానికి ఈ వేడుకకి చిరంజీవిగానీ .. చరణ్ గాని ముఖ్య అతిథులుగా రావలసి ఉందట. అయితే ఏపీ ఎన్నికల్లో  పవన్ పార్టి  'జనసేన' పోటీ చేస్తుండటంతో, మీడియాకి దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే వాళ్లు రావడం లేదని తెలుస్తోంది. 

ఇక వరుసగా ఆరు డిజాస్టర్లు చవిచూసినప్పటికీ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తదుపరి చిత్రం అయిన 'చిత్రలహరి' కు మంచి క్రేజే ఉంది. అందుకు సాక్ష్యంగా ఈ చిత్రం మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది.  ఆ స్దాయి బిజినెస్ కి కారణం ఈ చిత్ర టీజర్. కిషోర్ తిరుమల దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా టీజర్ రీసెంట్ గా విడుదల అయ్యి మంచి క్రేజ్ తెచ్చుకుంది. కేవలం నిమిషం నిడివి గల ఈ వీడియో కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్  వచ్చింది.