దివంగత శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ 'ధడక్' చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా హిట్ కావడంతో జాన్వీకి బాలీవుడ్ లో క్రేజ్ బాగా పెరిగింది. వరుస ప్రాజెక్ట్ లను అంగీకరిస్తూ బిజీగా గడుపుతోంది. ఇటీవల జాన్వీ ఓ ఈవెంట్ కి హాజరైంది.

ఈ ఈవెంట్ లో మీడియా అడిగిన ప్రశ్నలకు అపెస్ట్ అయిన జాన్వీ ప్రెస్ మీట్ మధ్యలో నుండే లేచి వెళ్లిపోవడం హాట్ టాపిక్ గా మారింది. మొదట మీడియా అడిగిన అన్ని ప్రశ్నలకు జాన్వీ సమాధానాలు చెప్పింది.

ఇంతలో ఓ రిపోర్టర్ 'శ్రీదేవి బంగాళా' సినిమా వివాదం గురించి జాన్వీని ప్రశ్నించారు. దానికి ఎలా స్పందించాలో అర్ధంకాని ఆమె సైలెంట్ గా ఉండిపోయింది. ఆమె ముఖకవళికలు కూడా మారిపోయాయి. ఇది గమనించిన జాన్వీ మేనేజర్ వెంటనే ఆ రిపోర్టర్ ని ఇలాంటి ప్రశ్న అడగడం ఏంటని మందలించాడు. ఇక ప్రెస్ మీట్ చాలని చెప్పి జాన్వీని మధ్యలో నుండే తీసుకువెళ్లిపోయారు.

ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన 'శ్రీదేవి బంగాళా' టీజర్ ఇటీవల విడుదలైంది. ఈ టీజర్ చూసిన వారంతా నటి శ్రీదేవి జీవితానికి దగ్గరగా ఉందనే కామెంట్స్ చేశారు. దీంతో శ్రీదేవి భర్త బోనీకపూర్ చిత్రబృందానికి లీగల్ నోటీసులు జారీ చేశారు. 'శ్రీదేవి బంగాళా' చిత్రయూనిట్ మాత్రం ఈ సినిమాకి శ్రీదేవి జీవితంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇంకా ఈ వివాదం సాగుతూనే ఉంది.