అతిలోక సుందరి శ్రీదేవి హిందీతోపాటు దక్షిణాదిలో ఎంతగా ఆదరణ పొందిందో తెలిసిందే. శ్రీదేవి కంటే అందమైన నటి ఈ జగత్తులో ఉంటారా? అనే సందేహం కూడా కలిగిన సందర్భాలున్నాయి. ఆమె సౌత్‌ మొత్తాన్ని ఓ ఊపు ఊపింది. తరగని అందంతో, కళ్లు చెదిరే నటనతో, కనువిందు చేసే డాన్సులతో యావత్‌ ప్రేక్షక లోకాన్ని మైమరపించింది. ఒకానొక సమయంలో అగ్ర హీరోలను మించి ఇమేజ్‌ను, ఆదరణను సొంతం చేసుకుంది. 

ఆమె మరణాంతరం ఆమె ముద్దుల తనయ జాన్వీకపూర్‌ సినీ రంగప్రవేశం చేశారు. తన మెంటర్‌ కరణ్‌ జోహార్‌ ఆమె కెరీర్‌ని తీర్చిదిద్దే బాధ్యతలు తన భుజాలపై వేసుకున్నారు. తొలి ప్రయత్నంగా `దఢక్‌` చిత్రంలో నటించారు. ఈ సినిమా మంచి విజయాన్నే సాధించింది. తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది జాన్వీ. ప్రస్తుతం ఆమె `గుంజన్‌ సక్సేనా` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు పలు క్రేజీ ప్రాజెక్ట్ లను రెడీ చేసిపెట్డాడు కరణ్‌. 

ఇదిలా ఉంటే ఈ అమ్మడికి టాలీవుడ్‌పై మోజు పడిందట. జాన్వీ కపూర్‌ తల్లిలాగానే తను కూడా తెలుగుతోపాటు సౌత్‌లో మంచి ఆదరణ పొందాలని భావిస్తుందట. అయితే ఇది ప్రధానంగా తన తండ్రి బోనీ కపూర్‌ డ్రీమ్‌ అని, ఆయన జాన్వీ తెలుగు ఎంట్రీకి సంబంధించి సన్నాహాలు చేస్తున్నారని ఆ మధ్య వార్తలొచ్చాయి. అందులో భాగంగా ఓ భారీ ప్రాజెక్ట్ తో తెలుగులోకి ఎంట్రీ ఇప్పించాలని ప్లాన్‌ చేశారు. ఆ టైమ్‌ ఇప్పుడు వచ్చిందని, తాజాగా ఆమె తెలుగు సినిమా ఖరారైందని తెలుస్తుంది. 

ఎన్టీఆర్‌ సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీని ఫిక్స్ చేసుకుందట. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ ఓ సినిమా చేస్తున్నారు. ఇది ప్రీప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. ఇందులో హీరోయిన్‌గా జాన్వీని ఫైనల్‌ చేశారని అంటున్నారు. మొదటగా ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజాహెగ్డే, కియారా అద్వానీ, అనన్యపాండే వంటి పేర్లు వినిపించాయి. కానీ జాన్వీ ఫైనల్‌ నేమ్‌గా త్రివిక్రమ్‌ ఖరారు చేసినట్టు ఫిల్మ్ నగర్‌ టాక్‌. ఇదే నిజమైతే, ఇక జాన్వీ టాలీవుడ్‌ ఎంట్రీకి లైన్‌ క్లియర్‌ అయ్యిందనే చెప్పాలి. మరి తల్లి శ్రీదేవి లాగా తాను కూడా ఓ ఊపు ఊపుతుందా? అనేది చూడాలి.