'మళ్లీరావా' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన దర్శకుడు గౌతం తిన్ననూరి. మొదటి సినిమా తో సక్సెస్ అందుకున్న ఈ దర్శకుడు రెండో సినిమానానితో ప్లాన్ చేశాడు. నాని హీరోగా 'జెర్సీ' అనే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఎమోషనల్ కథతో ఆడియన్స్ ని మెప్పించాడు.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్ లో రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ కలిసి హిందీలో ఈ సినిమా రీమేక్ ప్లాన్ చేస్తున్నారు. డైరెక్టర్ గా గౌతం తిన్ననూరినే ఫైనల్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ మధ్య కాలంలో చాలా మంది దర్శకులు తెలుగు నుండి బాలీవుడ్ కి వెళ్లి అక్కడ సక్సెస్ అవుతున్నారు. 'అర్జున్ రెడ్డి' సినిమా తీసిన సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ లో అదే  సినిమాను 'కబీర్ సింగ్'గా రీమేక్ గా చేసి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా దెబ్బకి సందీప్ కి బాలీవుడ్ లో అవకాశాలు పెరిగాయి.

అలానే మన దగ్గర ఫ్లాప్ అయిన దర్శకుడు దేవాకట్టా కూడా ఇప్పుడు హిందీకి వెళ్లి 'ప్రస్తానం' రీమేక్ తో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. ఈ సినిమా హిట్ అయితే దేవకట్టా కూడా బాలీవుడ్ లో సెటిల్ అయ్యేలా కనిపిస్తున్నాడు. ఇప్పుడు దర్శకుడు గౌతం తిన్ననూరి కూడా బాలీవుడ్ బాట పడుతున్నారు.