కన్నడ స్టార్ హీరోలు యష్, దర్శన్ లకు రాజకీయ పార్టీల నుండి బెదిరింపులు వస్తున్నాయి. మండ్య లోక్‌సభ నుండి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా బరిలోకి దిగిన నటి సుమలతకి మద్దతు పలికారు స్టార్ హీరోలు యష్, దర్శన్ లు. కేవలం మద్దతు తెలిపి ఊరుకోకుండా.. ఆమె వెంటే ఉంటూ ప్రచారాల్లో కూడా పాల్గొంటున్నారు.

వారు అలా చేయడం జేడీఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారు. ఇదే స్థానం నుండి సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ పోటీ చేస్తున్నందున సీటుకి ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పుడు సుమలతకి తోడుగా ఇద్దరు స్టార్ హీరోలు ఉండడంతో జేడీఎస్ నేతల్లో గుబులుపుట్టేలా చేస్తోంది. దీంతో కె.ఆర్.పేటకి చెందిన జేడీఎస్ ఎమ్మెల్యే నారాయణగౌడ ఇరువురి హీరోలపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు.

యష్, దర్శన్ లు ఇదే విధంగా ప్రవర్తిస్తే వారికి తగిన గుణపాఠం చెప్పాల్సి ఉంటుందని అన్నారు. వారికి సంబంధించిన అక్రమ జాతకాలను బయటకితీస్తామని
బెదిరిస్తున్నారు. కన్నడ నటుడు గౌరవంగా వారి ఇళ్లల్లో ఉండాలని ప్రచారం పేరుతో జేడీఎస్ నాయకులను విమర్శిస్తే ఊరుకునేదే లేదని అంటున్నారు. అసలు రాజకీయాలతో ఈ ఇద్దరి హీరోలకు సంబంధం ఏంటని ప్రశ్నించారు.

ఇది ఇలా ఉండగా.. 'నమ్మ కర్ణాటక రక్షణా వేదిక' అధ్యక్షుడు జయరాజ్‌ నాయుడు బృందం.. ఇరువురు స్టార్ హీరోలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని వారి సినిమాలను 'కోడ్' ఉల్లంఘనగా భావించి నిలిపివేయాలని ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేశారు.