ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఎంతో మార్పు వచ్చిందని సినీ నటుడు జేడి చక్రవర్తి అంటున్నారు. చాలా కాలం తరువాత జేడి 'హిప్పీ' సినిమాలో కీలకపాత్ర పోషించారు. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సందర్భంగా ఆయన కొన్ని మీడియా వర్గాలకు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలో అతడికి జగన్ కి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన జగన్ పై మీ అభిప్రాయమేంటని ప్రశ్నించగా.. ఒకప్పటితో పోలిస్తే జగన్ లో చాలా మార్పు వచ్చిందని జేడి అన్నారు. 

2008లో జేడి చక్రవర్తికి యాక్సిడెంట్ కావడంతో నడవలేని పరిస్థితి ఏర్పడిందట. దీంతో ఓసారి విమానంలో ప్రయాణించాల్సి వచ్చిందట. తను కూర్చున్న సీటు సౌకర్యంగా లేదని.. వీల్ చైర్ కావాలని సిబ్బందిని అడిగారట. ఆ సమయంలో తన పక్కన జగన్ ఉన్నారని, కనీసం తనను చూసి పలకరించలేదు కూడా అంటూ చెప్పుకొచ్చారు.

జగన్ ప్రవర్తన చూసి షాకయ్యానని చెప్పిన ఆయన ఇప్పుడు అతడిలో మార్పు వచ్చిందని చెప్పారు. గతేడాది మళ్లీ ఎయిర్ పోర్ట్ లో జగన్ ని చూశానని, అప్పుడు ఆయన 'ఎలా ఉన్నారు..?' అంటూ తనను పలకరించారని జేడి చెప్పారు. ఇన్నేళ్లలో జగన్ లో చాలా మార్పు వచ్చిందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.