మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సిల్వర్ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చిన పవన్‌ కళ్యాణ్, తరువాత రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశాడు. మెగా ఫ్యామిలీ హీరోగా పరిచయం అయినా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ సొంతం చేసుకున్న మరే హీరోకు సాధ్యం కాని రేంజ్‌లో ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే పవన్‌ పుట్టిన రోజు హ్యాష్ ట్యాగ్‌ వరల్డ్ రికార్డ్‌ సృష్టించిందంటేనే అభిమానులు పవన్‌ బర్త్‌ డే కోసం ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

అయితే ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అఫీషియల్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో ఓ ఇంటర్వ్యూ వీడియోను పోస్ట్ చేసింది. దాదాపు నాలుగున్నర నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో పవన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకోవటం అస్సలు ఇష్టం ఉండదన్న పవన్‌, చిన్నతనం తనతో పాటు ఇంట్లో వాళ్లు కూడా పవన్‌ పుట్టిన రోజును మర్చిపోయేవారట. ఒకటి రెండు రోజుల తరువాత వదిన (చిరంజీవి భార్య సురేఖ) గుర్తొచ్చి ఏదైనా కొనుక్కొమ్మని డబ్బు ఇస్తే దాంతో పుస్తకాలు కొనుక్కునేవాణ్ణి అంటే చెప్పుకొచ్చాడు.

కొద్ది రోజులు గా పవన్‌ అభిమానులు జనసేన కార్యకర్తలు పవర్‌ స్టార్ పుట్టిన రోజును పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు చేస్తున్న సందర్భంగా ఆయన వారికి కృతజ్ఞతలు తెలిపాడు. ఓ వ్యక్తిని ప్రజలు ఇంతలా ఆరాధిస్తారన్న విషయాన్ని తాను నమ్మలేకపోతున్నానని, అదంతా వారి గొప్పతనం అంటూ చెప్పుకొచ్చాడు పవన్‌.