ప్రతీరోజు అదిరిపోయే వసూళ్లు తీసుకొస్తోంది జేమ్స్. మొన్నటి వరకు కన్నడ ఇండస్ట్రీలో కెజిఎఫ్: చాప్టర్ 1 పేరు మీదున్న రికార్డులను ఇప్పుడు జేమ్స్ తుడిచి పెట్టేసింది.
కన్నడ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’. ఆయన మరణానంతరం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రంకు స్పందన మామూలుగా లేదు. పునీత్ జయంతిని పురస్కరించుకుని ‘జేమ్స్’ కూడా కన్నడతోపాటు, తెలుగులోనూ విడుదల చేశారు. `జేమ్స్` ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్స్ తీసుకొస్తోంది. కన్నడ సినిమాకు ఇప్పటివరకు ఎప్పుడూ లేనంత రికార్డుల వర్షం కురిపిస్తోంది ఈ చిత్రం. పునీత్ చివరి సినిమా కావడంతో థియేటర్స్ పోటెత్తారు ప్రేక్షకులు. ముఖ్యంగా అభిమానులు అయితే ముందు రోజు రాత్రి నుంచి థియోటర్స్ కు చేరుకున్నారు. ఆయన్ని చివరి సారి స్క్రీన్ మీద చూడాలని గంటల పాటు థియేటర్స్ ముందు క్యూ కట్టారు.
ఈ చిత్రం 400 థియేటర్లలో రిలీజైంది. చేతన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కలెక్షన్ల పరంగా అదరగొడుతోంది. బాక్స్‌ఆఫీస్ వద్ద కేవలం నాలుగు రోజుల్లో ఏకంగా రూ. 100 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రతీరోజు అదిరిపోయే వసూళ్లు తీసుకొస్తోంది జేమ్స్. మొన్నటి వరకు కన్నడ ఇండస్ట్రీలో కెజిఎఫ్: చాప్టర్ 1 పేరు మీదున్న రికార్డులను ఇప్పుడు జేమ్స్ తుడిచి పెట్టేసింది.
జేమ్స్ సినిమాను కేవలం కర్ణాటకలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో కూడా చూస్తున్నారు. పునీత్ రాజ్‌కుమార్ చివరి సినిమా కావడంతో అభిమానులు ఈ సినిమా కోసం చాలా కాలంగా వేచి చూస్తున్నారు. ఇది సినిమా కంటే కూడా ఫ్యాన్స్‌కి ఎమోషన్ గా చెప్తున్నారు. ఈ సినిమా అపూర్వ విజయం సాధించడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొదటి 5 రోజుల్లో 110 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.
కాగా ఈ సినిమాలో పునీత్ సరసన ప్రియా ఆనంద్ హీరోయిన్‌గా నటించింది. పునీత్ రాజ్‌కుమార్ సోదరులు రాఘవేంద్ర, శివ రాజ్‌కుమార్ అతిధి పాత్రల్లో కనిపించారు.
ఇక గత ఏడాది అక్టోబర్‌లో గుండెపోటుతో పునీత్ మరణించిన విషయం తెలిసిందే.. ఆ సమయంలో జేమ్స్ మూవీ 90 శాతం షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రంలో పునీత్‌కి ఆయన సోదరుడు శివ రాజ్‌కుమార్ డబ్బింగ్ చెప్పారు.
