దశాబ్దాల కాలంగా జేమ్స్ బాండ్ చిత్రాలతో అలరిస్తున్న హాలీవుడ్ నటుడు డేనియల్ క్రెయిగ్ కు తీవ్రగాయమైంది. ప్రస్తుతం డేనియల్ జేమ్స్ బాండ్ 25వ చిత్ర షూటింగ్ జరుగుతోంది. వెస్టిండీస్ లోని జమైకాలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతున్న సమయంలో కింద పడిపోవడం వల్ల డేనియల్ కాలికి తీవ్రగాయమైనట్లు ఆంగ్ల పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. దీనితో చిత్ర యూనిట్ మెరుగైన వైద్యం కోసం అతడిని అమెరికాకు తరలించింది. 

ఈ గాయం నుంచి కోలుకోవడానికి డేనియల్ కు చాలా సమయం పట్టొచ్చని అంటున్నారు. దీనితో అప్పటి వరకు జేమ్స్ బాండ్ 25వ చితం అటకెక్కినట్లే.  చిత్ర యూనిట్ త్వరలో కీలకమైన షెడ్యూల్ కు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. తదుపరి షెడ్యూల్ లండన్ లోని ప్రతిష్టాత్మకమైన ఫైన్ వుడ్ స్టూడియోలో జరగాల్సిన ఉంది. ఈ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ భారీగా ఖర్చు చేసిందట. డేనియల్ కు గాయం కావడంతో నిర్మాతలకు నష్టం తప్పదని అంటున్నారు.  

ఇలాంటి గాయాలు డేనియల్ కు కొత్త కాదు. రిస్క్ తో కూడుకున్న స్టంట్స్ లో డేనియల్ తరచుగా నటిస్తుంటాడు. క్యాసినో రాయల్ చిత్ర షూటింగ్ సందర్భంగా కూడా డేనియల్ ఇదే తరహాలో గాయపడ్డాడు. స్టంట్ చేస్తూ కింద పడిపోవడం అప్పట్లో డేనియల్ పళ్లు ఊడిపోయాయి. ఇలాంటి గాయాలు లెక్కచేయకుండా డేనియల్ బాండ్ చిత్రాల్లో నటిస్తూ అలరిస్తున్నాడు.