సారాంశం
చిరంజీవి-శ్రీదేవి నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి మళ్లీ మే 9న థియేటర్లలో విడుదల కానుంది.
మెగాస్టార్ చిరంజీవి, నటి శ్రీదేవి జంటగా నటించిన క్లాసిక్ సోషియో-ఫాంటసీ చిత్రం జగదేకవీరుడు అతిలోకసుందరి (JVAS) తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం 1990, మే 9న విడుదలై అప్పట్లో సంచలనం సృష్టించింది. కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించింది.
35 ఏళ్ల తర్వాత, మళ్లీ అదే తేదీన 2025, మే 9న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది. వైజయంతి మూవీస్ నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో దాదాపు రూ.2 కోట్లు బడ్జెట్‌తో రూపొందింది. ఆ టైంలో ఇది భారీ బడ్జెట్‌గా చిత్రంగా పరిగణించబడింది. ఇండస్ట్రీ హిట్ గా నిలిచి నిర్మాతకు కాసుల వర్షం కురిపించిన ఈ చిత్రం కోసం చిరంజీవి, శ్రీదేవి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు అనేది చాలా ఆసక్తికరం. చిరంజీవి రూ.25 లక్షలు, శ్రీదేవి రూ.20 లక్షలు పారితోషికంగా తీసుకున్నారు. ఆ టైంలో శ్రీదేవి, చిరంజీవి ఇద్దరూ తిరుగులేని స్టార్లు.
వైజయంతి మూవీస్ బృందం గత 4 ఏళ్లుగా ఈ సినిమాకి సంబంధించిన ఒరిజినల్ నెగటివ్‌ను వెతకడంలో నిమగ్నమై ఉంది. ఈ ప్రయత్నం విజయవంతమవడంతో, సినిమాను ఇప్పుడు 4K రిజల్యూషన్, 2D, అధునాతన 3D ఫార్మాట్లలో విడుదల చేయనున్నారు.
చిత్రానికి సంగీతాన్ని ఇళయరాజా స్వరపరిచారు. ఆయన అందించిన పాటలు అప్పట్లో సూపర్ హిట్ అయ్యాయి. చిరంజీవి అభిమానులు సినిమాను మళ్లీ థియేటర్‌లో చూసే అవకాశాన్ని పొందబోతున్నారు. ఇప్పటితరం ప్రేక్షకులకు ఈ సినిమా తెలుగు సినిమా వైభవాన్ని కొత్త కోణంలో చూపించబోతోంది.