మెగాస్టార్ సినిమాకేనా `జగదేక వీరుడు అతిలోక సుందరి` కాపీరైట్ వార్నింగ్?
చిరంజీవి నటించిన `జగదేక వీరుడు అతిలోక సుందరి` సినిమా కాపీరైట్ హక్కులకు సంబంధించి ఇప్పుడు ఆయన కొత్త సినిమా కిందే కుంపటి పెట్టేలా ఉందని అంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి కలిసి నటించిన బ్లాక్ బస్టర్ క్లాసిక్ మూవీ `జగదేక వీరుడు అతిలోక సుందరి` ఇప్పుడు ఒక్కసారిగా వార్తల్లో నిలుస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన సర్వ హక్కులు తమ వద్దే ఉన్నాయని, తమకే సొంతమని ప్రొడక్షన్ హౌజ్ వైజయంతి మూవీస్ ఓ ప్రకటన విడుదల చేసింది. తమ కంటెంట్‌ని ఏ రూపంలో వాడినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ కాపీరైట్ నోట్‌ని సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. మరి ఎవరిని ఉద్దేశించి ఈ ప్రకటన విడుదల చేశారనేది ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతుంది. అదే సమయంలో సంచలనంగా మారుతుంది.
అయితే ఇది మెగాస్టార్ చిరంజీవి సినిమాని ఉద్దేశించి పెట్టిన పోస్ట్ అని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ఆయన నటించిన సినిమాకి సంబంధించిన కాపీరైట్ ఇష్యూ ఇప్పుడు కొత్తగా రాబోతున్న చిరంజీవి సినిమాని ఉద్దేశించే విడుదల చేశారని సోషల్ మీడియాలో కామెంట్లు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం చిరంజీవి.. `బింబిసార` ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. సోషియో ఫాంటసీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. యూవీ క్రియేషన్స్ దీన్ని నిర్మించనుంది.
ఈ సినిమాకి `ముల్లోకవీరుడు` అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారట. ఇందులో హీరో వేరే లోకానికి వెళ్తాడని, అక్కడ దేవకన్యలని కలుస్తాడని, అక్కడ వారితో హీరో ప్రణయాలు, యుద్ధాలు వంటివి ఉండబోతున్నాయని తెలుస్తుంది. అయితే చూడ్డానికి `జగదేక వీరుడు అతిలోక సుందరి` సినిమాకి సీక్వెల్ తరహాలో ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. `జగదేక వీరుడు అతిలోక సుందరి` సినిమాకి సీక్వెల్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది.
ఈ నేపథ్యంలో వైజయంతి మూవీస్ ఈ లేటెస్ట్ ప్రకటన విడుదల చేయడంతో మొత్తం హీటెక్కిపోయింది. టాలీవుడ్‌లో పెద్ద దుమారం రేపుతుంది. గత చిరంజీవి సినిమానే ఇప్పటి ఆయన సినిమాకి అడ్డంకిగా మారుతుందా? అనే కామెంట్లు వస్తున్నాయి. ఇది మరింత హాట్ టాపిక్ అవుతుంది. మరి దీనిపై ఎవరు ఎలా రియాక్ట్ అవుతారు? ఈ ప్రకటన ఎలాంటి దుమారం రేపుతుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.
దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శత్వంలో రూపొందిన `జగదేక వీరుడు అతిలోక సుందరి` చిత్రంలో చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించగా, సినిమా 1990 మే 9న విడుదలైంది. రెండు కోట్లతో రూపొంది, ఏకంగా 15కోట్లు వసూలు చేసిందని సమాచారం. మొత్తంగా ఇది అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఇక చిరంజీవి, వశిష్ట మూవీ త్వరలోనే పట్టాలెక్కబోతుందని సమాచారం.