పంచ్ ప్రసాద్ కి ఆపరేషన్ పూర్తి... సీఎం జగన్ కి ధన్యవాదాలు!
జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ చాలా కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఎట్టకేలకు ఆయనకు ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. ఏపీ ప్రభుత్వం ఇందుకు సహకారం అందించింది.

సీనియర్ జబర్దస్త్ కమెడియన్స్ లో పంచ్ ప్రసాద్ ఒకరు. ఏళ్లుగా పలువురి టీమ్స్ లో ఆయన పని చేశారు. తన మార్కు కామెడీతో అలరిస్తున్నాడు. పంచ్ ప్రసాద్ కి కిడ్నీ సమస్య ఉంది. వ్యాధి తీవ్రం కావడంతో డయాలసిస్ తో నెట్టుకొస్తున్నారు. తోటి జబర్దస్త్ కమెడియన్స్, జడ్జెస్ ఆర్థికంగా పలుమార్లు ఆదుకున్నారు. ఆరోగ్యం సరిగా లేకున్నా మిత్రుల సహాయంతో బుల్లితెర షోలలో కనిపిస్తున్నాడు. ఆ వచ్చిన డబ్బులు వైద్యానికి ఉపయోగిస్తున్నారు.
ఖరీదైన వైద్యం కావడంతో తన సంపాదన సరిపోవడం లేదు. అభిమానులను కూడా పంచ్ ప్రసాద్ చికిత్స కోసం విరాళాలు అడిగారు. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి రూ. 1 లక్ష ఆర్థిక సహాయం చేశాడని సమాచారం. ఆ మధ్య పంచ్ ప్రసాద్ కి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అని వార్తలు వచ్చాయి. తన కిడ్నీ ఇచ్చేందుకు భార్య సిద్ధం కాగా వైద్యులు వద్దని సూచించారట. డోనర్ దొరికిన నేపథ్యంలో మీరు కిడ్నీ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారట.
ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలన్నా కూడా పంచ్ ప్రసాద్ ఆరోగ్యం మెరుగ్గా ఉండాలి. అందుకే ట్రాన్స్ప్లాంటేషన్ లేటైంది. ఎట్టకేలకు హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో పంచ్ ప్రసాద్ కి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. ఇందుకు ఏపీ ప్రభుత్వం సహకారం అందించింది. పంచ్ ప్రసాద్ వైద్యానికి అయిన ఖర్చు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా విడుదల చేశారు. మంత్రి రోజా పంచ్ ప్రసాద్ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో సానుకూలంగా స్పందించింది. సీఎంఆర్ఎఫ్ తరపున పంచ్ ప్రసాద్ కి వైద్యం అందింది.
దీంతో పంచ్ ప్రసాద్ సీఎం జగన్, మంత్రి రోజాలతో పాటు మిత్రులు, అభిమానులకు ధన్యవాదాలు చెప్పుకున్నాడు. నా ఆరోగ్య పరిస్థితి మంత్రి రోజాగారు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి సీఎంఆర్ఎఫ్ ద్వారా నా చికిత్స అవసరమైన నిధులు విడుదల చేశారని పంచ్ ప్రసాద్ అన్నారు. పంచ్ ప్రసాద్ కోలుకున్నట్లు తెలుస్తుంది. త్వరలో ఆయన తిరిగి బుల్లితెర మీద సందడి చేయనున్నారు.