Hyper Aadi: ఆయనకు క్షమాపణలు చెప్పాను!
ధనుష్ సార్ మూవీ విజయపథంలో దూసుకుపోతుండగా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో నటుడు జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఆసక్తికర కామెంట్స్ చేశారు.
వేదికపై మాట్లాడటం ఒక ఆర్ట్. జనాల ముందు తడబడకుండా మాట్లాడాలంటే ధైర్యంతో పాటు టాలెంట్ కూడా ఉండాలి. సినిమా వేదికల్లో అలరించేలా మాట్లాడంలో త్రివిక్రమ్ కి ఓ బ్రాండ్ ఇమేజ్ ఉంది. లేటెస్ట్ సెన్సేషన్ హైపర్ ఆది ఈ విషయంలో ఆయన్ని మించిపోయేలా ఉన్నారు. పంచ్లు, ప్రాసలతో అనర్గళంగా మాట్లాడేస్తున్నాడు. సినిమా డైలాగ్స్ కి మించిన వన్ లైనర్స్ వదులుతున్నారు. సార్ సక్సెస్ మీట్లో హైపర్ ఆది స్పీచ్ అద్భుతంగా సాగింది.
ముఖ్య అతిథిగా వచ్చిన ఆర్ నారాయణమూర్తిపై హైపర్ ఆది పొగడ్తలు కురిపించారు. సార్ మూవీతో హీరో ధనుష్ పై ప్రేమ, దర్శకుడు వెంకీ అట్లూరిపై గౌరవం పెరిగాయని హైపర్ ఆది అన్నారు. ఇద్దరు టీచర్స్ మధ్య వెంకీ అట్లూరి అందమైన ప్రేమ కథ నడిపారు అన్నారు. పాత్రలను దృష్టిలో పెట్టుకొని హద్దులు దాటకుండా రొమాన్స్ చూపించడం గొప్ప విషయం అన్నారు. ఇక చదువు గొప్పతనం ఏమిటో వెంకీ అట్లూరి గొప్పగా చెప్పారని కొనియాడారు. సార్ సినిమా చూశాకా... మా సుబ్రహ్మణ్యం మాస్టారుకి ఫోన్ చేసి క్షమాపణ చెప్పానని హైపర్ ఆది అన్నారు.
సుబ్రహ్మణ్యం సార్ ఆ రోజుల్లో నేనేమైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించమని ఫోన్ చేసి చెప్పాను. అప్పుడే కాదురా ఇప్పుడు కూడా ఇబ్బంది పెడుతున్నావ్. ఈ టైంలోనంట్రా కాల్ చేసేదని ఆయన అన్నారు... అంటూ హైపర్ ఆది సరదాగా మాట్లాడారు. చివర్లో హీరోయిన్ సంయుక్త గురించి మాట్లాడుతూ... ఇకపై ఆమెను మీనాక్షి టీచర్ అని పిలుస్తారని అంత సహజంగా పాత్రలో ఒదిగిపోయారని ప్రశంసలు కురిపించారు.
ముఖ్య అతిథి ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ.. "ముందుగా ఇలాంటి ఒక మంచి చిత్రాన్ని, ఒక గొప్ప చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. గుండెలకు హత్తుకునేలా సినిమా ఉంటే సూపర్ హిట్ చేస్తామని మరోసారి ప్రేక్షకులు నిరూపించారు. ఇంత మంచి సినిమా తీసిన దర్శకుడికి నా అభినందనలు. ఇలాంటి సినిమాలు తీయడం ఆశామాషి కాదు. దానికి గుండె ధైర్యం కావాలి. ఇది ఆర్ట్ ఫిల్మ్ కాదు.. కానీ ఆర్ట్ ఫిల్మే. ఇది కమర్షియల్ సినిమా కాదు.. కానీ కమర్షియల్ సినిమానే. అలా మాయ చేశాడు దర్శకుడు. ఇది ప్రజల సినిమా, స్టూడెంట్స్ సినిమా, పేరెంట్స్ సినిమా. జీవితంలో గుర్తుండిపోయే ఇలాంటి సినిమా తీసి హిట్ కొట్టిన నిర్మాతకు నా అభినందనలు. హాలీవుడ్ యాక్టర్ సిడ్నీ పోయిటియర్ నటించిన 'టు సర్, విత్ లవ్', ఎన్టీ రామారావు గారి 'బడిపంతులు', హృతిక్ రోషన్ నటించిన 'సూపర్ 30' లాగా ఇది కూడా సూపర్ డూపర్ హిట్. ఈ సినిమా గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. విద్య, వైద్యం అనేవి ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని రాజ్యాంగ మనకు కల్పించిన హక్కు. కానీ అవి వ్యాపారం అయిపోయాయి. విద్య, వైద్యం వ్యాపారం కాకూడదు. పేదలందరికీ విద్య అందుబాటులో ఉండాలి.. ప్రైవేట్ సెక్టార్ వద్దు, పబ్లిక్ సెక్టార్ ముద్దు అనే సందేశాన్ని చాటి చెప్పిన ఈ చిత్రానికి హ్యాట్సాఫ్. దర్శకుడు సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు. కొన్ని సన్నివేశాలు కంటతడి పెట్టించాయి. ప్రతి పాత్రను ఎంతో చక్కగా తీర్చిదిద్దారు. సంయుక్తమీనన్, సాయి కుమార్, సముద్రఖని, తనికెళ్ళ భరణి, హైపర్ ఆది అందరూ అద్భుతంగా నటించారు. కెమెరామెన్ 90ల బ్యాక్ డ్రాప్ ని చక్కగా చూపించారు. ధనుష్ గారు గొప్ప నటుడు. సహజంగా నటిస్తారు. భాషతో సంబంధం లేకుండా అందరికీ దగ్గరైన నటుడు. ఆయన నటనకు సెల్యూట్." అన్నారు.
నటుడు సుమంత్ మాట్లాడుతూ.. "ఇంత మంచి పాత్ర రాసి, ఆ పాత్రకు నేను న్యాయం చేస్తానని నమ్మిన దర్శకుడు వెంకీకి థాంక్స్. తక్కువ రోజులే పనిచేసిన ఈ సినిమాలో భాగం కావడం ఆనందాన్ని ఇచ్చింది. నాకొక అలవాటు ఉంది. పాత్ర చిన్నదైనా పెద్దదైనా స్క్రిప్ట్ మొత్తం చదవడం అలవాటు. చదవగానే ఈ స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది. ఈ సబ్జెక్ట్ తీస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అనిపించింది. ఊహించిన దానికంటే పెద్ద విజయం సాధించింది. ఈ స్థాయిలో వసూళ్ళు రావడం సంతోషంగా ఉంది" అన్నారు.