ప్రతి గురు, శుక్రవారాల్లో తెలుగు నాట ఓ ప్రముఖ ఛానెళ్లో ప్రసారమయ్యే జబర్దస్త్ ప్రొగ్రామ్ ద్వారా బాగా పేరు సంపాదించిన ఓ ఆర్టిస్ట్ ఎర్రచందనం స్మగ్లింగ్‌కు కింగ్ అంటూ ఇవాళ ఉదయం సోషల్ మీడియాతో పాటు కొన్ని వార్తాపత్రికల్లోనూ కథనాలు రావడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. తిరుపతికి చెందిన ఇతని గురించి ఆంధ్రప్రదేశ్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల వద్ద పక్కా సమాచారం ఉండటంతో అతను ఎవరా అన్న ఆతృత జనంలో కలుగుతుంది.

చిన్నప్పటి నుంచి నటుడిగా ఓ వెలుగు వెలగాలనుకున్న అతను చిన్నా, చితకా పాత్రలు చేస్తూ... ప్రస్తుతం జబర్దస్త్‌లోని ప్రముఖ టీమ్‌లో కీలకపాత్ర పోషిస్తున్నాడట.. కానీ సులభంగా డబ్బు సంపాదించాలన్న అతని ఆశ అడ్డదారులు తొక్కించిదని అలా మెల్ల మెల్లగా శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ముఠాతో పరిచయాలు ఏర్పరచుకున్నాడట.. చివరికి అతనే ఓ ముఠాకి నాయకుడిగా మారి ఎర్రచందనాన్ని సరిహద్దులు దాటించి కోట్లకు పడగలెత్ాడు..

ఇటీవలే తనకు బాగా కావాల్సిన నటుడు హీరోగా నటించగా.. ఆ సినిమాకి ఫైనాన్స్ కూడా చేశాడట.. అతనికి పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటకల్లోని పేరు మోసిన స్మగ్లర్లతో పరిచయాలు ఉన్నాయట.. ఇతనిపై ఇప్పటి వరకు 20 కేసులు నమోదు చేశామని.. త్వరలోనే ఆ నటుడిని అదుపులోకి తీసుకుంటామని టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్పష్టం చేశారు. తమ తోటి కళాకారుడిగా ఉంటూ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఆ వ్యక్తి ఎవరోనని జబర్దస్త్ నటులతో పాటు.. కృష్ణానగర్‌లో జోరుగా చర్చ జరుగుతోంది.