పవన్‌ కళ్యాణ్‌ అంటే పడి చచ్చే అభిమానులెందరో ఉన్నారు. పవర్‌ స్టార్‌ కోసం ప్రాణమైనా ఇస్తామని బహిరంగంగానే ప్రకటిస్తుంటారు. పవన్‌ మేనరిజానికి.. ఆయన వ్యక్తిత్వానికి, సేవా గుణానికి ఎంతో మంది అభిమానులయ్యారు. అందులో సెలబ్రిటీలు ఉన్నారు. పవన్‌ కళ్యాణ్‌ వీరాభిమానుల్లో జబర్దస్త్ ఫేమ్‌ హైపర్‌ ఆది కూడా ఉన్నారు. ఇటీవల పవన్‌ కళ్యాణ్‌ బర్త్‌ డే జరిగింది. సోషల్‌ మీడియాలో మోత మోగింది. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమా అప్‌డేట్‌లు బ్యాక్‌ టూ బ్యాక్‌ రావడంతో అభిమానులు ఖుషీ అయ్యారు. 

అదే సమయంలో కొందరు విమర్శకులు, రాజకీయ ప్రత్యర్థులు పవన్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేయడమేంటి? సినిమాలు మానేస్తా అని మళ్లీ నటించడమేంటీ అంటూ పవన్‌పై రకరకాల కామెంట్‌ చేస్తున్నారు. ఇవి చూసిన హైపర్‌ ఆది ఊగిపోయాడు. తమ అభిమాన హీరోపై విమర్శలు చేయడాన్ని తట్టుకోలేకపోయాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన స్పందిస్తూ, ప్రత్యర్థులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. పవన్‌ కళ్యాణ్‌ని ఎవరూ ఏం పీకలేరని బోల్డ్ కామెంట్‌ చేశారు. 

పవన్‌ ఏం చేసిన అందులో ఓ మంచే ఉంటుందని, అందులో లాజిక్‌ ఉంటుందన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవన్‌ ఓడిపోవడం బాధగా ఉందన్నారు. ఆ తర్వాత ప్రజా సమస్యలపై ఆయన స్పందిస్తున్న విధానం, జనంలోకి వెళ్ళి సమస్యల పరిష్కారం కోసం పాడుపడుతున్న విధానం సంతోషాన్నిచ్చిందని, ఆయనపై మరింత గౌరవం, అభిమానం పెరిగిందన్నారు. తన వద్ద ఉన్నదంతా దానం చేసి పస్తులుండే వ్యక్తిత్వం తమ పవర్‌ స్టార్‌ది అని, అందుకే ఆయనకు తాను పెద్ద అభిమానిని అని చెప్పాడు. 

వరుసగా 12 సినిమాలు పరాజయం చెందినా ఆయన ఇమేజ్‌ తగ్గలేదని, ఒక్క హిట్‌ ఆయన ఇమేజ్‌ని మరింత పెంచిందన్నారు. అలాంటిది సీట్లు, ఓట్లు ఆయన రేంజ్‌ని తగ్గించలేవన్నారు. కొన్నిసార్లు రావడం లేట్‌ అయినా, రావడం మాత్రం పక్కా అని తనదైన పంచ్‌లతో విరుచుకుపడ్డారు. అంతటితో ఆగలేదు.. సినిమాల్లో చిరంజీవిని, క్రికెట్‌లో సచిన్‌ టెండుల్కర్‌ని, వ్యక్తిత్వంలో పవన్‌ కళ్యాణ్‌ని మించిన వ్యక్తులు లేరన్నాడు. 

పవన్‌పై వస్తోన్న విమర్శలపై ఆది స్పందిస్తూ, పార్టీని మెయింటేన్‌ చేయడానికి ఫండ్‌ కావాలి. అది మీరిస్తారా? ప్రశ్నించాడు. సినిమాల ద్వారా వచ్చిన డబ్బుతో పార్టీని, తన స్టాఫ్‌ని చూసుకోవాల్సి ఉంటుంది. సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తారని తెలిపారు. మిగతా నాయకుల్లాగా ఆయనకు వేరే వ్యాపారం లేదని సెటైర్లు వేశాడు. ఈ సందర్భంగా పవన్‌ని టార్గెట్‌ చేసిన వారికి వార్నింగ్‌ ఇచ్చారు. ఆయన్ని ఎవరూ ఏం పీకలేరని స్పష్టం చేశారు. ఆది వ్యాఖ్యలతో పవన్‌ అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. తమలో మరింత జోష్‌ నింపారని ఆదిని పొగుడుతున్నారు. మొత్తంగా ఆది పవన్‌పై తనకున్న వీరాభిమానాన్ని చాటుకుంటూ ప్రత్యర్థుల దుమ్ముదుళిపేశాడని చెప్పొచ్చు.