హైదరాబాద్ మాదాపూర్‌లో ఉన్న నటుడు మంచు విష్ణు కార్యాలయంపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ), జీఎస్టీ శాఖలు సంయుక్తంగా సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
మంచు విష్ణు కార్యాలయంపై ఐటీ, జీఎస్టీ అధికారుల సోదాలు
హైదరాబాద్ మాదాపూర్‌లో ఉన్న నటుడు మంచు విష్ణు కార్యాలయంపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ), జీఎస్టీ శాఖలు సంయుక్తంగా సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. మంచు విష్ణు నటించిన కన్నప్ప చిత్రం మరో రెండు రోజుల్లో రిలీజ్ అవుతోంది. ఈ తరుణంలో ఐటీ దాడులు జరగడం కన్నప్ప చిత్ర యూనిట్ కి షాకింగ్ పరిణామమే అని చెప్పాలి. కన్నప్ప చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ లో మంచు విష్ణు తండ్రి మోహన్ బాబు నిర్మించారు.
కన్నప్ప బడ్జెట్ లెక్కలపై ఆరా
కన్నప్ప సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది. భారీ విఎఫ్ఎక్స్, సెట్ వర్క్, నటీనటుల రెమ్యునరేషన్లతో నిర్మాణ వ్యయం 100 కోట్లు దాటినట్లు తెలుస్తోంది. అయితే మంచు విష్ణు కానీ, మోహన్ బాబు కానీ ఎప్పుడూ ఎక్కడా బడ్జెట్ వివరాలు బయట పెట్టలేదు. ఓ ఇంటర్వ్యూలో బడ్జెట్ గురించి అడిగిన ప్రశ్నకి విష్ణు సమాధానం ఇస్తూ.. ఆ వివరాలు ఇప్పుడు ఎందుకు.. చెబితే ఐటీ అధికారులు మా ఇంటికి వస్తారు అని సరదాగా తెలిపారు. కానీ ఇప్పుడు అదే నిజం అయింది. కన్నప్ప బడ్జెట్‌కు సంబంధించిన పూర్తి లెక్కలపై అనుమానాలు వ్యక్తం కావడంతో జీఎస్టీ శాఖ అధికారులు దర్యాప్తును ప్రారంభించారు.ఈ దాడుల్లో పలు డిజిటల్ డాక్యుమెంట్లు, లెక్కలు, ల్యాప్టాప్‌లు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల ప్రకారం, చిత్ర నిర్మాణ సమయంలో పన్నుల ఎగవేత గురించి కూడా అధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ పరిణామాలపై మంచు విష్ణు ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే పరిశ్రమలో ఈ సోదాలపై చర్చ నడుస్తోంది. కన్నప్ప సినిమా విడుదలకు ముందే వివాదాల్లో కూరుకుపోవడం చర్చనీయాంశమైంది. పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. కన్నప్ప చిత్రంలో మంచు విష్ణుకి జోడిగా ప్రీతీ ముకుందన్ నటించారు. మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ కీలక పాత్రల్లో నటించారు.
