పూరి జగన్నాధ్ వరుస పరాజయాల తర్వాత సంచలనమే చేశాడు. తన సినిమా హిట్ అయితే బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం ఎలా ఉంటుందో మరోసారి పూరి నిరూపించాడు. పూరి జగన్నాధ్ ఎక్కువగా మాస్ చిత్రాలనే తెరక్కిస్తుంటాడు. పూరి మార్క్ వినోదం, ఫైట్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంటాయి. ఆ అంశాలు ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో పక్కాగా ఉండేలా పూరి ప్లాన్ చేసుకున్నాడు. అది బాగా వర్కౌట్ ఐంది. 

ఈ చిత్రం విడుదలై 12 రోజులు గడుస్తోంది. తొలి వారంలోనే ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి లాభాలు ప్రారంభమయ్యాయి. రెండ వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్ర దూకుడు తగ్గలేదు. 12 రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 32 కోట్ల షేర్ రాబట్టింది. ఈ చిత్రానికి జరిగిన ప్రీరిలీజ్ బిజినెస్ 17 కోట్లు. అంటే ఈ చిత్ర వసూళ్లు రెట్టింపు దిశగా దూసుకుపోతున్నాయి. 

హీరో రామ్ ఈ చిత్రంలో మాస్ లుక్ లో అదరగొట్టేశాడు. నాభా నటేష్, నిధి అగర్వాల్ అందాల ఆరబోతలో ఆకట్టుకున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి మంచి మాస్ ఆల్బమ్ అందించాడు. పూరి కనెక్ట్స్ బ్యానర్ లో పూరి జగన్నాధ్, చార్మి కలసి ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం.