కేంద్రం మెల్లిగా గత కొద్ది నెలలుగా మూసి వేసిన పరిశ్రమలపై ఆంక్షలు ఎత్తి వేస్తోంది. అయితే సినిమా ఇండస్ట్రీ పరిస్దితి ఏమిటనేది తేలటం లేదు.  లాక్ డౌన్ వలన సినిమా షూటింగ్ లు వాయిదా పడ్డాయి. థియేటర్లు మూతపడ్డాయి. మొత్తంగా టాలీవుడ్ బాగానే నష్టపోయింది. అయితే మళ్ళీ షూటింగ్ లు ఎప్పుడు మొదలవుతాయి అన్నది అందరిలో మెదలుతున్న ప్రశ్న. ఇక వీలైనంత తొందరగా మళ్లీ షూటింగ్‌లు ప్రారంభించి మళ్ళీ ఇండస్ట్రీకి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని ఇండస్ట్రీలోని పెద్దలు ఆలోచిస్తున్నారు. అయితే అందుకు ప్రభుత్వం నుంచి ఫర్మిషన్స్ రావాలి. అయితే ఈ విషయమై కేంద్రం కొన్ని ఆలోచనలు చేస్తోందని జాతీయ పత్రికల ద్వారా తెలుస్తోంది. షూటింగ్ ల కోసం కేంద్రం కొన్ని ప్లాన్స్, స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఇవ్వబోతోందని సమాచారం. అవి ఏమిటో చూద్దాం. 

అందుతున్న సమాచారం మేరకు సినిమా క్రూ (నటీనటులు, క్రూ మెంబర్స్ )లో ఎవరికి కరోనా వైరస్ లేదని  సినిమా నిర్మాతలు సర్టిఫికేట్ ఇవ్వాలి. ఆ మేరకు లైట్ బోయ్ దగ్గర నుంచి అందరికీ నిర్మాత సొంత ఖర్చులతో టెస్ట్  లు చేయించాలి. అలాగే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా షూటింగ్ సమయంలో ఎవరైనా కరోనా తో మరణిస్తే యాభై లక్షలు వారికి పరిహారం ఇవ్వాలి. అయితే ఇది చాలా పెద్ద మొత్తం. ముఖ్యంగా చిన్న సినిమా వాళ్లు భరించలేరు. అలాగే టీవి సీరియల్స్, వెబ్ సీరిస్ లు వంటి చిన్న బడ్జెట్ ప్రాజెక్టులకు కూడా చాలా కష్టం. 

ఇక షూటింగ్ లొకేషన్స్ పూర్తిగా షూటింగ్కు ముందు తరువాత  శానిటైజ్ చేయించాలి. షూటింగ్ లొకేషన్స్ అందరూ ఫేస్ మాస్క్ లు, శానిటైజర్స్ వాడాలి. అందుకు నిర్మాత భాధ్యత వహించాలి. అప్పుడు ఎంత పెద్ద క్రూతో అయినా షూట్ చేసుకోవచ్చు. ఫిల్మ్ షూటింగ్ లను ఎక్కువగా జనం గేదర్ అయ్యే చోట చేయకూడదు. అంతేకాకుండా షూట్ పూర్తయ్యాక కూడా జనాల్లోకి వెళ్లిపోకూడదు. షూట్ పూర్తయ్యినా కొంతకాలం దాకా ఎవరితో కలవకూడదు.  ఫిల్మ్ టీమ్ తప్పించి ఒక్కరు కూడా బయటవాళ్లు షూటింగ్ స్పాట్ కు రాకూడదు. ఫ్రెండ్స్, రెలేటివ్స్, విజిటర్స్ పూర్తిగా నిషిధ్దం. 
 
ఏ షూటింగ్ అయినా ఇండియాలో కరోనా లేని ప్రాంతాల్లో గ్రీన్ జోన్ లోనే జరుపుకోవాలి. విదేశాలకు వెళ్లటానికి ఫర్మిషన్ లేదు. ఇవన్నీ ఓకే అనుకుంటే జూన్ 1 నుంచి షూటింగ్ కు ఫర్మిషన్ ఇచ్చే అవకాసం ఉందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే టాలీవుడ్ సినీ నిర్మాతలు కొందరు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి ఫిల్మ్ ఛాంబర్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. షూటింగ్ లు ప్రారంభించడానికి కచ్చితంగా సమయం చెప్పలేమని, మంచి చేయాలనీ ఇప్పుడు అనుకోని ముందుకు వెళ్తే చెడు జరిగితే ముందు నుంచి చేసిన పనికి చెడ్డపేరు వస్తుందని మంత్రి వెల్లడించారు. కాబట్టి లాక్ డౌన్ అయిపోయాక తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.