హాస్యనటుడిగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు సునీల్‌. ఆ  తర్వాత హీరోగా ప్రమోషన్ పొంది తానేంటో నిరూపించుకునే ప్రయత్నంలో తడబడ్డారు. కానీ తప్పుకోలేదు. వరస ప్లాఫ్ లు రావటంతో .. ఇటీవల కాలంలో మళ్లీ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్స్ ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్నారు. అయితే ఆయనలో హీరోగా చేయాలనే కోరిక పోలేదు. అందుకే ఆయన దృష్టి రీమేక్ లపై పడింది. ఇప్పటికే ఓ మరాఠి రీమేక్ ని లైన్ లో పెట్టిన ఆయన ఓ కన్నడ రీమేక్ లో చేయాలని ఉత్సాహపడ్డారు. ఆ సినిమా మరేదో కాదు `బెల్ బోట‌మ్‌`. ఆ సినిమా రైట్స్ కొని తను హీరోగా చేద్దామనే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే ఈ లోగా ఆహా ఈ ఉత్సాహానికి గండికొట్టింది.   

ఆహాలో  ఈమ‌ధ్యనే  `బెల్ బోట‌మ్‌` డబ్బింగ్ వెర్షన్ రిలీజైంది.  డిటెక్టీవ్ నేప‌థ్యంలో సాగే ఈ కథ నిజానికి సునీల్ కి బాగా న‌చ్చింద‌ని సమాచారం‌. ఈ క్రమంలో ఈ రీమేక్ ని డైరక్ట్ చేయమని ఇద్దరు ముగ్గురు డైరక్టర్స్ ని సంప్రదించాడట‌. అయితే ఇంతలోనే ఈసినిమాని `ఆహా`లోకి డ‌బ్బింగ్ రూపంలో తీసుకొచ్చేశారు. `ఆహా`లో తెలుగు డ‌బ్బింగ్ సినిమా చూసిన వాళ్లంతా..సునీల్ కు ఫోన్ చేసి `ఇది తెలుగులో నీతో రీమేక్ చేస్తే బాగుంటుంది` అన్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. దాంతో సునీల్ ఇప్పుడు పున‌రాలోచ‌న‌లో ప‌డ్డాడ‌ట‌. ఆహాలో డ‌బ్ అయితే అయ్యింది.. రీమేక్ రైట్స్ కొనుక్కుని, కొన్ని మార్పులు చేర్పుల‌తో తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుంద‌ని భావిస్తున్నాడ‌ని సమాచారం. సునీల్‌ బాడీ లాంగ్వేజ్‌కు సరిగ్గా సరిపోయే కథ కావడంతో ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

 రిషబ్‌శెట్టి  హీరోగా కన్నడలో ఘన విజయం సాధించిన చిత్రం ‘బెల్‌బాటమ్‌’. ఇటీవల ‘ఆహా’ ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. డిటెక్టివ్‌గా రిషబ్‌శెట్టి నటన, రెట్రో థీమ్‌లో కథా, స్క్రీన్‌ప్లేలను దర్శకుడు జయతీర్థ నడిపించిన విధానం ఆకట్టుకుంది. 

 అదే నిజమైతే మరోసారి సునీల్‌ తనదైన శైలిలో నవ్వించడం ఖాయం. మరి ఈ సినిమాను పట్టాలెక్కించేదెవరు? ఎవరు దర్శకత్వం వహిస్తారు? తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. మరోవైపు ‘పుష్ప’, ‘వేదాంతం రాఘవయ్య’తో పాటు పలు చిత్రాల్లో నటిస్తున్నారు.