'కెజిఎఫ్' చిత్రంతో పాపులర్ హీరోగా మారిపోయాడు యష్. దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. కన్నడ సినిమాలు కూడా వంద కోట్లు వసూళ్లు చేయగలవని ప్రూవ్ చేశాడు. అయితే ఇప్పుడు యష్ కి సంబంధించిన ఒక వార్త కన్నడ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 

యష్ తన భార్య రాధికని రాజకీయాల్లోకి పంపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన పార్మేంట్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీ చేసిన సుమలత యష్ మద్దతు పలుకుతూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని మాండ్య నియోజకవర్గంలో ఆమె గెలుపుకి కారణమయ్యాడు. 

ప్రచార కార్యక్రమాల్లో యష్ స్పీచ్ లు విన్నవారంతా అతడు రాజకీయాల్లోకి వస్తే రాణించగలడని అన్నారు. అయితే ఇప్పుడు యష్ తన భార్యని  రంగంలోకి దింపుతున్నాడని టాక్.  హాసన్ లోక్ సభ నియోజకవర్గం నుండి ఆమెని బరిలోకి దింపే ఆలోచనలో ఉన్నారట. ఈ వార్తలు అభిమానులకు ఆనందాన్నిస్తున్నాయి.

అయితే ఇవి కేవలం రూమర్స్ మాత్రమేనని కొట్టిపారేస్తున్నారు యష్ సన్నిహితులు. ఇటీవలే కూతురికి జన్మనిచ్చిన రాధిక అమ్మతనాన్ని ఎంజాయ్ చేస్తోందని, ఆమెకి  రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని చెబుతున్నారు. రాధిక గతంలో కొన్ని సీరియల్స్ లో, అలానే సినిమాలలో నటించింది. యష్ ని పెళ్లి చేసుకున్న తరువాత ఇండస్ట్రీకి దూరమైంది.