ఇటీవల వాలంటీర్ అనే పదం రాజకీయాల్లో ఎంత ప్రకంపనలు రేపిందో తెలిసిందే. ఈ క్రమంలో జబర్దస్త్ ఇమ్మానియేల్ ప్రేమ వాలంటీర్ అంటూ సిరీస్ చేయడం ఆసక్తి రేపింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ లోని వాలంటీర్ వ్యవస్థను వ్యతిరేకించిన విషయం తెలిసిందే. వాలంటీర్లు ఒంటరి మహిళల సమాచారం సేకరించి హ్యూమన్ ట్రాఫికింగ్ కి సహకరిస్తున్నారు. డేటా బ్రీచ్ కి పాల్పడుతున్నారు. వాలంటీర్స్ చాలా ప్రమాదకరం అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. వాలంటీర్లను క్రిమినల్స్ గా పవన్ కళ్యాణ్ అభివర్ణించిన నేపథ్యంలో వివాదం రాజుకుంది. పవన్ కళ్యాణ్ వాఖ్యలకు వ్యతిరేకంగా వాలంటీర్స్ నిరసన ప్రదర్శనలు చేశారు. పవన్ మాత్రం తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోలేదు. వాలంటీర్, సచివాలయ వ్యవస్థలు నిరర్థకం అన్నారు.
జనసేన వర్గాలు ఏపీ వాలంటీర్స్ కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. పవన్ కళ్యాణ్ ప్రసంగాలతో ప్రజల్లో వాలంటీర్స్ పట్ల వ్యతిరేకత వచ్చిందా లేదా? అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాలి. ఈ వివాదాల మధ్య జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానియల్ 'ప్రేమ వాలంటీర్' టైటిల్ తో వెబ్ సిరీస్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
వాలంటీర్ వ్యవస్థ మీద వైసీపీ ప్రత్యర్థులు చేసిన ఆరోపణల్లో ప్రేమలు, మహిళలను లొంగదీసుకోవడం అనేవి కూడా ఉన్నాయి. పథకాల గురించి అడిగిన మహిళలను వాలంటీర్లు వస్తావా అని అడుగుతున్నారని టీడీపీ నేత అనిత ఆరోపించారు. ఒకవేళ ఇమ్మానియల్ 'ప్రేమ వాలంటీర్' సిరీస్లో వాలంటీర్ వ్యవస్థను, వాలంటీర్లను తప్పుగా చూపిస్తే ఇది రాజకీయ వివాదానికి దారి తీయవచ్చు.
అందులోనూ జబర్దస్త్ కమెడియన్స్ వైసీపీ వ్యతిరేకులనే ముద్ర ఉంది. నాగబాబు శిష్యులుగా ఎప్పటి నుండో జనసేన పార్టీకి పని చేస్తున్నారు. హైపర్ ఆది అయితే కరుడుగట్టిన జనసేన నాయకుడు. ఇటీవల బుల్లెట్ భాస్కర్ వృద్ధుల పెన్షన్ విషయంలో ఏపీ గవర్నమెంట్ పై సెటైర్ వేసి క్షమాపణలు చెప్పాడు. ప్రేమ వాలంటీర్ సిరీస్ కి జబర్దస్త్ బాబు దర్శకుడు కాగా ఇమ్మానియేల్ హీరోగా చేశాడు.
ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తలు ప్రేమ వాలంటీర్ ద్వారా ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే కుట్ర కావచ్చని అంచనా వేస్తున్నారు. టైటిల్ బాగుంది. కానీ పొలిటికల్ ప్రాపగాండాకు దిగితే మర్యాదగా ఉండదంటూ వార్నింగ్స్ ఇస్తున్నారు. జబర్దస్త్ కమెడియన్స్ సమక్షంలో ప్రేమ వాలంటీర్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మరి ఈ వెబ్ సిరీస్లో కేవలం కామెడీ పంచారా? వివాదాలు జోడించారా? అనేది విడుదలైతే కానీ తెలియదు.

