బిగ్ బాస్ 3 వివాదం మరింతగా పెరుగుతోంది. ప్రారంభానికి ముందే బిగ్ బాస్ షోకు సమస్యలు వచ్చిపడ్డాయి. యాంకర్ శ్వేతా రెడ్డి, గాయత్రీ గుప్త ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులపై, కో ఆర్డినేటర్లపై పోలీస్ ఫిర్యాదు చేశారు. కంటెస్టెంట్స్ ఎంపిక నెపంతో కోఆర్డినేటర్లు అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు శ్వేతా రెడ్డి మీడియా ముందుకు వచ్చింది. 

గాయత్రీ గుప్త కూడా బిగ్ బాస్ లో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ వ్యాఖ్యలు చేసింది. వరుసగా ఎదురువుతున్న వివాదాలు హోస్ట్ గా చేయబోతున్న నాగార్జునకు తలనొప్పి వ్యవహారంలా మారాయి. ఉస్మానియా విద్యార్థులు బిగ్ బాస్ నిర్వాహకులపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. 

నాగార్జున ఇంటిని, అన్నపూర్ణ స్టూడియోను ముట్టడిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. జులై 21 ఆదివారం సాయంత్రం 9 గంటలకు బిగ్ బాస్ షో ప్రారంభం కానుంది. వరుస వివాదాలు నేపథ్యంలో బిగ్ బాస్ షో వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నాగార్జున కూడా బిగ్ బాస్ షో నుంచి తప్పుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు నాగ్ నిర్వాహకులతో సంప్రదింపులు జరుగుతున్నట్లు టాక్.