తెలుగులో అత్యంత భారీ బడ్జెట్‌తో, అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా `ఆర్‌ ఆర్‌ ఆర్‌`. పాన్‌ ఇండియా సినిమాగా దీన్ని దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్నారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు, కొమురంభీమ్‌.. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడానికి ముందు యువకులుగా ఉన్నప్పుడు ఇంటి నుంచి వెళ్లిపోయి ఓ రహస్య ప్రాంతాల్లో పోరాటం చేశారు. వాళ్లు ఎక్కడికి వెళ్లారు, అక్కడ ఏం చేశారనే నేపథ్యంలో ఫిక్షన్‌ కథతో ఈ సినిమాని రూపొందిస్తున్నారు రాజమౌళి. 

ఇందులో అల్లూరిగా రామ్‌చరణ్‌, కొమురంభీమ్‌గా ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. వారికి జోడిగా, అలియా భట్‌, ఒలివియా మోర్రీస్‌ నటిస్తున్నారు. అజయ్‌ దేవగన్‌, సముద్ర ఖని, శ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. రెండు రోజుల క్రితమే క్లైమాక్స్ ని రూపొందిస్తున్నట్టు దర్శకుడు, చిత్ర బృందం తెలిపారు. తాము అనుకున్నది నెరవేర్చడం కోసం అల్లూరి, భీమ్‌ కలిసి పోరాడుతున్న సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు. 

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అక్టోబర్‌ 8న విడుదలకు చిత్ర బృందం నిర్ణయించిందట. అయితే దీన్ని అధికారికంగా యూనిట్‌ ప్రకటించలేదుగానీ, ఐరీష్‌ నటి అలిసన్‌ డూడీ ఇన్‌స్టాగ్రామ్‌ లీక్‌ చేసింది. అనుకోకుండా ఆమె ఈ విషయాన్ని పోస్ట్ చేసింది. `లేడీ స్కాట్‌ని అక్టోబర్‌ 8న 2021ని చూస్తార`ని తెలిపింది. అయితే తనకు తెలియకుండానే రిలీజ్‌ డేట్‌ని చెప్పేసింది. దీంతో తన తప్పుని తెలుసుకున్న అలిసన్‌ డూడీ ఆ పోస్ట్ ని తొలగించి నార్మల్ గా ఆ ఫోటోని పంచుకుంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. 

ఈ విషయం తెలిసి రాజమౌళి అండ్‌ టీమ్‌ తలలు పట్టుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే షూటింగ్‌ ఆలస్యమై మూడు రిలీజ్‌ డేట్‌లు మార్చారు. ఇప్పుడు ఈ లీకేజ్‌ వ్యవహారం మరింత తలనొప్పిగా మారిందని టాక్. మరి దీనిపై రాజమౌళి టీమ్‌ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.