టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ తాజాగా నటించిన చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఈ మూవీ నుంచి తాజాగా ఇంట్రెస్టింగ్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఎమోషన్ అండ్ యాక్షన్ అంశాలతో కూడిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది.
గతంలో బ్యాక్ టు బ్యాక్ కామెడీ ఫిల్మ్స్ తో దూసుకుపోయిన అల్లరి నరేష్ కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. మళ్లీ మహేశ్ బాబు ‘మహర్షి’తో గట్టిగా రీఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ‘నాంది’చిత్రంతో మంచి హిట్ ను అందుకున్నారు. ఇలా విభిన్న కథాంశాలతో అలరిస్తున్న అల్లరి నరేశ్ ప్రస్తుతం మళ్లీ జోరు పెంచుతున్నారు. అల్లరి నరేష్ తాజా చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ (Itlu Maredumilli Prajaneekam)తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
బలమైన కథతో వస్తున్న‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ చిత్రానికి ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్‌తో కలిసి హాస్య మూవీస్‌పై రాజేష్ దండా దీనిని నిర్మిస్తున్నారు. మేకర్స్ తాజాగా ప్రమోషన్స్ ను ప్రారంభించారు. ఇందులో భాగంగా చిత్రబృందం అంతా ఈరోజు మారేడుమిల్లిని సందర్శించి, అల్లరి నరేష్‌తో కలిసి అక్కడ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ కట్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. అల్లరి నరేశ్ సరికొత్తగా కనిపిస్తున్నారు.
గిరిజన ప్రాంతమైన మారేడుమిల్లిలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొకుని ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ అధికారిగా అల్లరి నరేష్ కనిపించారు. రాష్ట్రమంతా ఎన్నికల కోసం ఎదురుచూస్తుంటుంది. ఈ పరిస్థితుల్లో నరేష్ కు అక్కడి ప్రజల ద్వారా కొన్ని సమస్యలు తెలుస్తాయి. వారికి సహాయం చేయడానికి ముందుకు వస్తాడు. దీంతో రాజకీయ నాయకులు మరియు పోలీసు అధికారుల నుండి పలు సమస్యలను ఎదుర్కొంటాడు. ఈ క్రమంలో యాక్షన్, ఎమోషన్ అంశాలతో నరేశ్ సినిమాపై ఆసక్తిని పెంచేశాడు. ట్రైలర్ లో అబ్బూరి రవి రాసిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.
అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్ గా ఆనంది ఆడిపాడనుంది. వీరిద్దరి స్క్రీన్ ప్రజెన్స్ బాగా ఆకట్టుకుంటోంది. స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ మరియు ప్రవీణ్ కామిక్ హాస్య సన్నివేశాలల్లో అదరగొట్టినట్టు కనిపిస్తోంది. సంపత్ రాజ్ సీరియస్ పాత్రలో కనిపించారు. ఈ నెల 25న విడుదల కానున్న ఈ సినిమాని చూడాలనే క్యూరియాసిటీని ట్రైలర్ పెంచింది. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ మరియు చోటా కె ప్రసాద్ ఎడిటర్ అయిన ఈ చిత్రానికి బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరించారు. చిత్రం కోసం ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు.
