ఎనర్జిటిక్ స్టార్ రామ్ సూపర్ హిట్ చిత్రం ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్ లోకి వచ్చాడు. అంతకు ముందు వరకు రామ్ వరుస పరాజయాలని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. డాషింగ్ డైరెక్టర్ పూరి దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం రామ్ కెరీర్ కు మంచి ఉత్సాహాన్నిచ్చింది. వసూళ్ల పరంగా ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 

అదే జోరుని తదుపరి చిత్రంలో కూడా కొనసాగించాలని రామ్ భావిస్తున్నాడు. అందుకే కథల ఎంపిక విషయంలో రామ్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాస్త ఆలస్యమైనా మంచి కథ, దర్శకుడు దొరికేవరకు వేచి చూడాలని రామ్ అనుకుంటున్నాడట. ఇదిలా ఉండగా మాస్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్ చివరగా తెరకెక్కించిన చిత్రం ఇంటెలిజెంట్. 

సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఆ తర్వాత వినాయక్ నుంచి మరో సినిమా రాలేదు. తాజా సమాచారం మేరకు రామ్, వినాయక్ మధ్య చర్చలు మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. వినాయక్ చెప్పిన కథ రామ్ కు కూడా నచ్చిందట. 

దీనితో వెంటనే ఈ కాంబినేషన్ ఒకే అవుతుందా లేక మరికొంత చర్చలు జరిగాక కంఫర్మ్ చేస్తారా అనేది వేచి చూడాలి. మాస్ అంశాలు పుష్కలంగా ఉండే కథ దొరికితే తన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాయో ఇస్మార్ట్ శంకర్ చిత్రం ద్వారా రామ్ నిరూపించాడు.