తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. తెలుగు వీరుడైన ఉయ్యాలవాడ పాత్రలో నటించాలనేది చిరంజీవి చాలా ఏళ్ల కల. బడ్జెట్ కారణాలవల్ల ఈ చిత్రం ఇప్పటికి కుదిరింది. స్వాతంత్ర వీరుడి చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం కాబట్టి అనేక ప్రశ్నలు ఉంటాయి. సైరా చిత్ర క్లైమాక్స్ గురించి విషయం లీకై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

నరసింహారెడ్డి గురించి తెలుగువారు తరచుగా వింటున్నా ఆయన చరిత్ర పూర్తిగా ప్రజలకు తెలియదు. నరసింహారెడ్డి మరణం గురించి ఓ విషయం అందరికి తెలిసి ఉంటుంది. భీకరమైన పోరాటం తర్వాత నరసింహారెడ్డిని బ్రిటిష్ వారు చంపేస్తారు. దాదాపు నెలరోజుల పాటు నరసింహారెడ్డి తలని కోట గుమ్మానికి బ్రిటిష్ ప్రభుత్వం వేలాడదీసినట్లు చరిత్రలో ఉంది. 

మెగాస్టార్ చిరంజీవి లాంటి టాప్ హీరోని అలా చూపించడం అంటే సాహసమే. కానీ దర్శకుడు సురేందర్ రెడ్డి ఎలాంటి మార్పులు లేకుండా తన ప్రతిభతో చాలా ఎమోషనల్ గా ఆ సన్నివేశాన్ని క్లైమాక్స్ లో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ చిత్ర క్లైమాక్స్ సినిమాకి ప్రధాన ఆకర్షణ కాబోతోందట. 

సైరా చిత్రంలో రత్నవేలు సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉండబోతున్నాయట. దాదాపు 17 విఎఫెక్స్ సంస్థలు సైరా కోసం పనిచేశాయి. అమితాబ్ బచ్చన్, తమన్నా, జగపతి బాబు, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక సెప్టెంబర్ 18న హైదరాబాద్ లో జరగబోతోంది.