రాయలసీమలో ఫ్యాక్షన్, బెజవాడలో రౌడీయిజం ఒకప్పుడు రాజ్యమేలాయి. ఈ క్రమంలో చాలా మంది మాస్ లీడర్స్ పుట్టుకుని వచ్చారు. బెజవాడలో దేవినేని నెహ్రూకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. దేవినేని అనేది ఈ చిత్ర టైటిల్. బెజవాడ సింహం అనేది క్యాప్షన్. ఈ చిత్రానికి నర్రా శివ నాగేశ్వరరావు దర్శకుడు. 

బెజవాడలోని ఇద్దరు గొప్ప నాయకుల మధ్య స్నేహం, వైరం లాంటి అంశాలని ఈ చిత్రంలో అద్భుతంగా చూపించబోతున్నట్లు శివనాగేశ్వరరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల్లో షూటింగ్ జరగనుంది. ఈ తాజాగా ఈ చిత్ర తొలి షెడ్యూల్ పూర్తయినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రంలో దేవినేని విద్యార్థి దశనుంచి రాజకీయాల్లో పోరాటాల్లో ఎలా పాల్గొన్నాడు అనే అంశాలు ఆసక్తికరంగా చూపించబోతున్నట్లు దర్శకుడు తెలిపాడు. 

దేవినేని పాత్రలో నందమూరి తారకరత్న నటిస్తున్నాడు. దేవినేని పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేసి నటిస్తున్నాడని శివనాగేశ్వర రావు ప్రశంసించారు. వంగవీటి రంగ పాత్రలో ప్రముఖ నటుడు బెనర్జీ నటిస్తున్నాడు. చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్నకుమార్ నటిస్తున్నాడు.