Devaraj: తెలుగులో విలన్‌గా, కన్నడలో 'డైనమిక్ హీరో'గా పేరు తెచ్చుకున్న దేవరాజ్ జీవితం ఎన్నో కష్టాలతో మొదలైంది. పేదరికాన్ని జయించి శాండల్‌వుడ్‌లో తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ఆయన బాల్యం, HMT ఉద్యోగం నుంచి సూపర్ హిట్ సినిమాల వరకు సాగిన ఆయన జర్నీ ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తుంది.

తెలుగులో విలన్‌గా పాపులర్‌ అయిన దేవరాజ్‌ కన్నడలో హీరో 

దేవరాజ్‌.. తెలుగులో ఎన్నో చిత్రాల్లో విలన్‌గా నటించాడు. విలన్‌ అంటే ఇలానే ఉంటాడనేలా భయపెట్టాడు. అదే సమయంలో కన్నడ చిత్ర పరిశ్రమకు ఆయన 'డైనమిక్ హీరో. పవర్‌ఫుల్ బాడీ లాంగ్వేజ్, గంభీరమైన గొంతు ఆయన సొంతం. అంతేకాదు, ఎలాంటి పాత్ర ఇచ్చినా ప్రాణం పోసే అరుదైన ప్రతిభ ఆయనలో ఉంది. వెండితెరపై తన స్టైల్, గంభీరతతో అభిమానులను ఉర్రూతలూగించిన దేవరాజ్‌ జీవితం పూలపాన్పు కాదు. పేదరికం, బాధలు, ఎన్నో కష్టాలను దాటుకుని శాండల్‌వుడ్‌లో తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న దేవరాజ్ స్ఫూర్తిదాయక జీవిత కథ ఇది.

దేవరాజ్ జీవితం ఎలా సాగింది?

దేవరాజ్ స్వస్థలం సాంస్కృతిక నగరమైన మైసూర్. 1953 సెప్టెంబర్ 20న రామచంద్రప్ప, లింగమ్మ దంపతులకు జన్మించారు. కానీ విధి రాత వేరుగా ఉంది. దేవరాజ్ పుట్టిన కేవలం మూడు నెలలకే, ITC ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఆయన తండ్రి మలేరియాతో ప్రాణాలు విడిచారు. తండ్రి మరణంతో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. తల్లి కష్టాన్ని కళ్లారా చూసిన దేవరాజ్, 9 ఏళ్ల వయసులోనే పని చేయడం ప్రారంభించారు.

చిన్నచిన్న పనులు చేస్తూ వచ్చిన డబ్బును తల్లికి ఇచ్చేవారు. అలా చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకున్నారు. 1976లో ప్రముఖ HMT వాచ్ కంపెనీలో ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడ్డారు. కానీ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నా దేవరాజ్ మనసులో కళపై ఆసక్తి ఉండేది. 'త్రిశూల' సినిమాతో సహనటుడిగా సినీ లోకంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 'మళవళ్ళి సర్కిల్' సినిమాలో అద్భుతంగా నటించి గాంధీనగర్ దృష్టిని ఆకర్షించారు.

హీరోగా బిగ్‌ బ్రేక్‌ 

'హత్యాకాండ' సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారిన దేవరాజ్.. ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. 'అంజద గండు', 'సాంగ్లియానా', 'సంగ్రామ', 'దాదా', 'ఆగంతుక', 'కృష్ణ రుక్మిణి', 'రామన్న శామన్న', 'నీ నన్న దైవ' సహా 150కి పైగా సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్‌ హీరోల జాబితాలో చేరారు. అదే సమయంలో అప్పట్లో తెలుగులో అనేక చిత్రాల్లో ఆయన విలన్‌గా నటించి మెప్పించారు. ఇక్కడ టాప్‌ విలన్‌గా రాణించారు. ఇప్పుడు తెలుగుకి దూరమయ్యారు.

సినిమాల్లో కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు నటి చంద్రలేఖతో పరిచయం ఏర్పడింది. చంద్రలేఖ మనసు దోచిన దేవరాజ్, స్వయంగా తానే ప్రేమను వ్యక్తపరిచారు. 1986లో పెద్దల సమక్షంలో వీరుద్దరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 1992లో వచ్చిన 'కెండద మళె' సినిమాలో ఈ జంట కలిసి నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. నేడు వీరి కుమారులు ప్రజ్వల్ దేవరాజ్, ప్రణమ్ దేవరాజ్ కన్నడ చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు. వీరిద్దరు నటులుగా రాణిస్తున్నారు.