ప్రముఖ నేపథ్య గాయని చిత్రకి ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. కేంద్రం తాజాగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో చిత్రని పద్మ భూషణ్‌ పురస్కారం ప్రకటించింది. దేశంలోనూ మూడో అత్యున్నత పురస్కారం లెజెండరీ సింగర్‌ చిత్రకి దక్కడం విశేషం. రిపబ్లిక్‌ డే సందర్భంగా చిత్ర ఫ్యాన్స్ కి కేంద్ర ప్రభుత్వం సర్‌ప్రైజ్‌ ఇచ్చిందనే చెప్పాలి. మరోవైపు గాన గాంధర్వుడు ఎస్పీబాలుకి ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్‌ పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఈ ఏడాదికిగానూ కేంద్రం పద్మ అవార్డులను సోమవారం ప్రకటించింది. ఇందులో 119 మందికి పద్మ అవార్డులు ప్రకటించగా, ఏడుగురికి పద్మ విభూషణ్‌, పది మందికి పద్మ భూషణ్‌ పురస్కరాలు, 102 మందికి పద్మ శ్రీ అవార్డులను ప్రకటించింది కేంద్రం. సినిమా రంగం నుంచి ఎస్పీ బాలు, చిత్రలతోపాటు కేరళాకి చెందిన సంగీత దర్శకుడు, గాయకుడు కైతప్రమ్‌ డామోదరన్‌ నంబూథిరి వంటి వారికి పద్మ అవార్డులు ప్రకటించింది కేంద్రం. 

గాయని చిత్ర ప్లే బ్యాక్‌ సింగర్‌గా  తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, హిందీ, ఒరియా, పంజాబి, గుజరాత్‌, తులు, రాజస్తాని, ఉర్దు, ఇలా దాదాపు 15 భాషల్లో వేల పాటలు పాడారు. ఆరు జాతీయ అవార్డులు అందుకున్నారు. అనేక ఇతర రాష్ట్రాల పురస్కారాలు పొందారు. 2005లో ఆమెకి కేంద్ర పద్మ శ్రీ అవార్డుని ప్రకటించగా, ఇప్పుడు పద్మ భూషణ్‌ పురస్కారం ప్రకటించింది.