తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కార్తీక్ దీపం సీరియల్ రోజుకో ట్విస్ట్ తో ఆసక్తికరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. డాక్టర్ బాబు పాత్ర చుట్టు తిరిగే  కార్తీక దీపం సీరియల్ మంచి రసపట్టు సాగుతుంది.  డాక్టర్‌బాబుగా ఎంతోమంది అభిమానం సొంతం చేసుకున్నారు బుల్లితెర నటుడు నిరుపమ్‌. నిరుపమ్ ఈ సీరియల్ తో బాగా పేరు వచ్చింది. బుల్లితెర శోభన్ బాబుగా పిలుచుకుంటూ డాక్టర్ బాబుని అభిమానించే ప్రేక్షకుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుండమే అందుకు కారణం. 

బుల్లితెర సంచలన హీరోగా మారిన డాక్టర్ బాబు తన రియల్ లైఫ్ వైఫ్‌తో కలసి సందడి చేసాడు. ఈటీవీలో ప్రసారం అవుతున్న ‘అలీతో సరదాగా’ కార్యక్రమానికి తన భార్య మంజులతో కలసి విచ్చేశారు డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్. ప్రేమించి పెళ్లిచేసుకున్న నిరుపమ్, మంజులలు తమ రియల్ లైఫ్ సీక్రెట్‌ను షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఓ సీరియల్ విషయంలో తనకు చెప్పుల దండ వేసి ఊరేగిస్తామని బెదిరింపులు రావడమే కాకుండా చంపేస్తాం అని అన్నారని చెప్పుకొచ్చాడు. 

నిరుపమ్ మాట్లాడుతూ..ఒక సీరియల్ విషయంలో చాలా బెదిరింపులు వచ్చాయి.. చంపేస్తాం.. లేపేస్తాం.. నువ్ ఎలా ఉంటావో చూస్తాం అని మెయిల్స్, కాల్స్ వచ్చేవి. చెప్పుల దండ వేసి సన్మానం చేస్తాం ఏమనుకుంటున్నావో.. బయట కనిపిస్తే వేసేస్తాం అని ఈ రేంజ్‌లో వార్నింగ్‌లు ఇచ్చారు. ఆ పాత్ర మీద వాళ్లు చూపించే అతి ప్రేమ అనుకోవచ్చు. సీరియల్‌ని సీరియల్‌లా చూస్తే ఇంతలా రియాక్ట్ అవ్వరు కానీ.. కాస్త ఎక్కువ కావడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తాయని చెప్పారు నిరుపమ్.

అలాగే.. తన ఇంటి పేరు పరిటాల కావడంతో పరిటాల రవి పేరుని చాలా సందర్భాల్లో వాడేశానని అంటున్నాడు డాక్టర్ బాబు. ఇతనితో పాటు మంజుల కూడా పరిటాల ఇంటి పేరుని పాస్ పోర్ట్ ఆఫీస్‌లో వాడేశానని సీక్రెట్స్ రివీల్ చేసింది.

చంద్రముఖి సీరియల్‌తో తన కెరియర్ ప్రారంభమైందని చెప్పారు నిరుపమ్. అదే సీరియల్‌లో తనకి చంద్రముఖి (మంజుల) దొరికిందని చెప్పారు. అప్పటికే మంజుల చాలా సీరియల్స్ చేసి టాప్ ప్లేస్‌లో ఉందని చెప్పిన నిరుపమ్.. తన ఫస్ట్ సీరియల్‌కి గుండుతో ఉండటంతో చెన్నై నుంచి వీడ్ని పట్టుకొచ్చారు అవసరమా? అని మంజుల అనుకున్నట్టుగా చెప్పారు నిరుపమ్. లక్కీగా అదే నాకు ఫస్ట్ సీరియల్ అని మంజులకు చెప్పకపోవడంతో తనతో కలిపి చేసిందని లేదంటే సీనియారిటీ చూపించేదని సరదాగా వ్యాఖ్యానించారు నిరుపమ్.

అలాగే  తనకు అష్టాచెమ్మా సినిమా ఆఫర్ మిస్ అయిన విషయాన్ని చెప్పారు నిరుపమ్. అష్టాచెమ్మా సినిమాకి ఆడిషన్స్‌కి పిలిచి తనకి ఒక సీన్ ఇచ్చారని.. అయితే ఆ సినిమా యూనిట్ వాళ్లు తన సీరియల్ చూసి.. మరుసటి రోజు పిలిచి ‘సీరియల్ చేస్తున్నట్టు ఉన్నావ్ కదా.. ఇంక ఆడిషన్స్ వద్దులే’.. అని పంపించేశారు అంటూ నాటి విషయాన్ని తెలియజేశారు నిరుపమ్.ఇంకా ఆయన ఏం చెప్పారో తెలియాలంటే.. మే 17  ‘ఈటీవీ’లో ప్రసారం కానున్న ‘ఆలీతో సరదాగా’ చూడాల్సిందే.  

తెలుగు టీవీ సీరియల్ చరిత్రలో అత్యధిక జనాదరణతో దూసుకెళ్తున్న కార్తీక దీపం సీరియల్ ముందు అగ్రహీరోలు కూడా చేతులెత్తేస్తున్నారు. ఇప్పటికే పలు టీవీ సీరియల్స్ కార్తీక దీపం సీరియల్‌కు వచ్చే రేటింగ్స్ లో సగం మాత్రమే తెచ్చుకొని సంతృప్తి చెందుతున్నాయి.ఓ టైమ్ లో ఏకంగా స్టార్ హీరోల సినిమాలను సైతం తోసి రాజని నెంబర్ వన్ స్థాయిలో నిలిచింది కార్తీక దీపం .  సాధారణంగా అగ్రహీరోల హిట్ సినిమాలు టీవీలో ప్రసారం చేసినప్పుడు వాటికి టీఆర్పీ రేటింగులు భారీ స్థాయిలో వస్తాయి. ఇంత కాంపిటీషన్ ఉన్నప్పటికీ కార్తీక దీపం సీరియల్ మాత్రం నెంబర్ వన్ స్థానంలో నిలవడం అటు బుల్లితెర పరిశ్రమతో పాటు టాలివుడ్ పరిశ్రమను కూడా షాక్ కు గురిచేస్తుంది.