ఇళయదళపతి విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ తరహాలో తమిళనాడులో అతడికి అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. మాస్ అభిమానులని మెప్పిస్తూనే విజయ్ వరుసగా సందేశాత్మక చిత్రాల్లో నటిస్తున్నాడు. కత్తి, మెర్సల్, తుపాకీ, సర్కార్ ఆ కోవకు చెందిన చిత్రాలే. 

దీనితో తమిళనాడులో విజయ్ అంటే పిచ్చెక్కిపోయే అభిమానులు ఏర్పడ్డారు. విజయ్ చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాలుగా నిలిచాయి. తాజాగా విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ రాసిన లెటర్ అంటూ ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ లేఖలో విజయ్ గురించి ఎమోషనల్ గా ఉంది. 

విజయ్ తల్లిదండ్రులు చంద్రశేఖర్, శోభా చంద్రశేఖర్ ఇద్దరూ చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తులే. చంద్రశేఖర్ తమిళంలో దర్శకుడు. శోభా చంద్రశేఖర్ కూడా దర్శకురాలిగా, గాయనిగా రాణించారు. శోభా చంద్రశేఖర్ వయసు 71 ఏళ్ళు. ఆమె తన కొడుకు గురించి ఈ లేఖలో పేర్కొంటూ.. త్యాగరాజ భాగవతార్, ఎంజీఆర్, రజనీకాంత్ తిరుగులేని స్టార్స్ గా వెలుగొందారు. వారి తర్వాత నువ్వే(విజయ్). 

నేను నీ తల్లినే. కానీ ఆ విషయాన్ని పక్కన పెట్టి నీ లక్షలాది మంది అభిమానుల్లో ఒకరిగా చెబుతున్నా. నీ ఖ్యాతి ప్రపంచం మొత్తం వినిపిస్తుంది అని శోభా లేఖలో పేర్కొన్నారు. నీవు పుట్టినప్పుడు తొలిసారి నుదిటిపై ముద్దు పెట్టిన మధుర క్షణం నాకింకా గుర్తుంది. కానీ ఇప్పుడు లక్షలాది మంది అభిమానులు, వారి తల్లులు నువ్వే మా లీడర్ అంటున్నారు అంటూ శోభా చంద్రశేఖర్ ఎమోషనల్ గా రాసిన లేఖ ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో 'బిగిల్' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.