ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సినిమాల్లో తన పాటలను వాడుకుంటున్న కొందరు సంగీత దర్శకులపై మండిపడ్డారు. గతంలో సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యానికి ఇదే విషయంలో ఇళయరాజా నోటీసులు కూడా పంపారు.

తన అనుమతి లేకుండా స్టేజ్ షోలలో తన పాటలు పాడకూడదని, అనుమతి తీసుకోవడంతో పాటు తనకు రెమ్యునరేషన్ కూడా ఇవ్వాలని అప్పట్లో గొడవ చేశారు. అయితే ఇప్పుడు చాలా సినిమాల్లో ఇళయరాజా పాటలను రీమిక్స్ చేసి వాడుకుంటున్నారు. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంగీత దర్శకులకు టాలెంట్ లేకే తన పాటలను రీమిక్స్ లుగా మార్చి వాడుకుంటున్నారని అన్నారు. టాలెంట్ ఉంటే మరొకరి పాటలు వాడుకోవాల్సిన అవసరం ఉండదని అన్నారు. ఇటీవల విడుదలైన '96' సినిమాలో తను కంపోజ్ చేసిన పాటలను తీసుకొని వాటిలో మార్పులు చేసి వాడారని, అది చాలా తప్పని అన్నారు. 

ప్రతిభ లేని వారే తన పాటలను వాడుకుంటున్నారని, ఇప్పుడున్న సంగీత దర్శకుల్లో విషయం లేదని సంచలన కామెంట్స్ చేశారు. ఒక సినిమాలో సంగీత దర్శకుడు మరొకరు కంపోజ్ చేసిన పాటలను వాడుకుంటున్నారంటే అది అతడి వైఫల్యమేనని అన్నారు.

తన పాటల నుండి ప్రజలను మళ్లించడం కుదరదు కాబట్టే ఇప్పటికీ తన పాటలను సినిమాల్లో వాడుకుంటున్నారని అన్నారు.