అందుకోసం నన్ను సెంట్రల్ మినిస్టర్ పదవి నుంచి తొలగించినా సంతోషమే: సురేశ్ గోపి
తన పదవి పోయినా పట్టించుకోనని ప్రముఖ నటుడు, కేంద్రమంత్రి సురేశ్ గోపి (Suresh Gopi) అన్నారు. తన సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు ఇప్పటికే అనుమతి అడిగానని తెలిపారు.
తనకు సినిమానే ముఖ్యమని, ఇంకా 22 సినిమాల్లో నటిస్తానని చెప్పారు కేంద్రమంత్రి సురేష్ గోపి. మంత్రి పదవిలో ఉంటూ సినిమాల్లో నటిస్తున్నందుకు.. ఒకవేళ తనను పదవిలో నుంచి తొలగిస్తే సంతోషిస్తానని అన్నారు. సినిమా తన అభిరుచి అని, అందుకోసం తన పదవి పోయినా పట్టించుకోనని ప్రముఖ నటుడు, కేంద్రమంత్రి సురేశ్ గోపి (Suresh Gopi) అన్నారు. తన సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు ఇప్పటికే అనుమతి అడిగానని తెలిపారు.
వివరాల్లోకి వెళితే.... కేంద్ర సహాయమంత్రి హోదాలో సురేశ్ గోపి (Suresh Gopi) పెట్రోలియం, సహజ వాయువు, పర్యటక శాఖల బాధ్యతలు చూస్తున్నారు. ఒకవైపు మినిస్టర్ పదవిలో ఉంటూనే.. సినిమాల్లో నటించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుమతి కోరారు. ఎన్ని సినిమాల్లో నటించాలని అనుకుంటున్నారని అప్పుడు అమిత్ షా అడిగినట్లు చెప్పారు. కేరళ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు.
సురేష్ గోపి మాట్లాడుతూ...‘‘నేను 22 సినిమాలు అని చెప్పా. ఆ మాట వినగానే నేను ఇచ్చిన అభ్యర్థన లేఖను పక్కనపెట్టారు. అయితే అనుమతి ఇస్తామని మాత్రం చెప్పారు. సెప్టెంబర్ 6 నుంచి ఒట్టకొంబన్ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటాను’’ అని ఈ మలయాళ నటుడు వెల్లడించారు. అలాగే షూటింగ్‌లో పాల్గొంటున్న సమయంలో కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహించేందుకు మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులను వెంట ఉంచుకుంటానని చెప్పారు.
‘‘ఇలా నా పనులు చేసుకోవాలనుకుంటున్నా. మంత్రి పదవిలో ఉండి షూటింగ్‌లో పాల్గొన్నందుకు నన్ను తొలగిస్తే.. బతికిపోయా అనుకుంటా. నేనెప్పుడు మంత్రిని కావాలని అనుకోలేదు. ఇప్పటికీ ఆ ఆశ ఏమీ లేదు. పార్టీ పెద్దల ఆదేశాలు అనుసరించానంతే. నా కోసం కాకుండా నన్ను గెలిపించిన త్రిశ్శూరు ప్రజల కోసం ఈ పదవి ఇస్తున్నట్లు వారు చెప్పారు. నేను అంగీకరించాను. అయితే నా అభిరుచికి దూరంగా ఉండమంటే మాత్రం నేను బతకలేను’’ అని అన్నారు. సినిమా తన ప్రాణం అని చెప్పారు.
కొన్ని నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో త్రిశ్శూరు నుంచి సురేశ్ గోపి (Suresh Gopi) విజయం సాధించారు. సీపీఐ నేత వీఎస్ సునీల్ కుమార్‌పై దాదాపు 70వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఉత్తరాదిలో బలంగా ఉన్న కాషాయ పార్టీ.. ఈ ఎన్నికల్లో త్రిశ్శూర్‌లో గెలవడంతో కేరళలో తొలిసారి ఖాతా తెరిచింది. కేంద్ర క్యాబినెట్‌లో కొనసాగడంపై ఆసక్తి లేదని ఆయన అన్నట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వాటిని అప్పట్లోనే గోపి (Suresh Gopi) తోసిపుచ్చారు. తనను ఎన్నుకున్న త్రిసూర్ ప్రజల కోసం తాను మంత్రి పదవిని స్వీకరించినట్టు సురేశ్ గోపి చెప్పారు.