యంగ్‌ హీరో అక్కినేని అఖిల్‌.. తన అక్కినేని వారసత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అక్కినేని వారసత్వాన్ని తీసుకోనని, దానికి దూరంగా ఉండాలనుకుంటున్నట్టు తెలిపారు.

అక్కినేని వారసుడు అఖిల్‌.. హీరోగా నిలబడేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆయన్ని ఇంకా ఆడియెన్స్ రిసీవ్ చేసుకోలేదు. ఇంకా ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాడు. `అఖిల్‌`, `హలో`, `మిస్టర్‌ మజ్ను`, `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` చిత్రాలతో వచ్చాడు. ఇందులో అన్ని సినిమాలు బోల్తా కొట్టాయి. `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్ లర్‌` అన్నింటితో పోల్చితే కాస్త బెటర్‌. ఇప్పుడు ఆయన `ఏజెంట్‌` అనే స్పై థ్రిల్లర్‌ చిత్రంతో వస్తున్నారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ సినిమా ఈ నెల 28న విడుదల కాబోతుంది. 

చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా అఖిల్‌.. తాజాగా అక్కినేని వారసత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వారసత్వం తనకొద్దని, ఆ ఊబిలో పడటం ఇష్టం లేదన్నారు. అందులో పడితే మూస ధోరణిలో సినిమాలు చేయాల్సి వస్తుందని, అలా చేయడం తనకు ఇష్టం లేదన్నారు. తాను స్వతహాగా ఎదగాలనుకుంటున్నట్టు తెలిపారు. తనని ఆడియెన్స్ రిసీవ్‌ చేసుకునేలా, వారికి నచ్చే సినిమాలు చేయాలనుకుంటున్నట్టు అఖిల్‌ తెలిపాడు. 

`అక్కినేని వారసుడిగా పనిచేయను. అఖిల్‌గా పనిచేస్తా. అక్కినేని వారసుడిగా చేస్తే ప్రతిసారి ఒకేలా పనిచేయాల్సి వస్తుంది. వారసత్వం అనేది బర్డెన్‌గా ఉంటుంది. కానీ ఒక నటుడిగా నేను ఎదిగేందుకు ప్రయత్నించాలి. తెలుగు ప్రేక్షకులు నన్ను ఓన్‌ చేసుకుంటే అది నాకు సంతోషాన్నిస్తుంది. దానికోసమే ప్రయత్నిస్తున్నా, దానికోసమే నా పోరాటం. నా కెరీర్‌ మొత్తం దానికోసమే ప్రయత్నిస్తాను. అక్కినేని వారసత్వం, ఆ లెగసీ నా భుజాలపై ఉంటే నేను ఎక్కువగా ఆలోచించి ఆ ట్రాక్‌లో వెళ్లిపోతా. నేను తెలుగు ఆడియెన్స్ అంగీకారాన్ని పొందడం నా డ్రీమ్‌` అని తెలిపారు అఖిల్‌. 

పరోక్షంగా తాను అక్కినేని వారసత్వానికి దూరంగా ఉండాలని, స్వతహాగా ఎదగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు అఖిల్‌. అంతేకాదు తన నిర్ణయాలు కూడా సొంతంగానే తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. `ఒక కొడుకుగా, నాన్న(నాగార్జున) వద్దకు వెళ్లొచ్చు, ఇది, అది అడగవచ్చు, కానీ నేను నటుడిగా ఎదగాలి, నేను నేర్చుకోవాలి, నేను కూడా నిర్ణయాలు తీసుకుని, బాధ్యతలు తీసుకోవాలని అనుకుంటున్నట్టు` చెప్పారు అఖిల్‌. `ఏజెంట్‌` సినిమా తన సొంత నిర్ణయమేనని, అందులో నాగ్‌ ప్రమేయం లేదన్నారు. ఇది సక్సెస్‌ అయినా, ఫెయిల్యూర్‌ అయినా తనదే బాధ్యత అని వెల్లడించారు. మరి అది సక్సెస్‌ అవుతుందా? లేదా అనేది ఈ నెల 28న చూడబోతారని చెప్పారు. ప్రస్తుతం `ఏజెంట్‌` సినిమా గురించి నాగ్‌కి ఏం చెప్పలేదని, ఎలాంటి రషెస్‌ చూడలేదని తెలిపారు. 

YouTube video player

ఇప్పుడు అఖిల్‌ చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి. అఖిల్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేశారేంటి అంటూ అభిమానులు షాక్‌ అవుతున్నారు. నటుడిగా ఎలాంటి సినిమాలైనా చేయోచ్చు, కానీ అక్కినేని వారసత్వానికి, ఆ ఇమేజ్‌కి తాను దూరంగా ఉండాలని, ఆ బర్డెన్‌ తీసుకోకూడదని ఆయన చెప్పడం హాట్‌ టాపిక్‌గా మారింది. మరి ఆయన వ్యాఖ్యలు పాజిటివ్‌గా వెళ్తాయా? నెగటివ్‌గా వెళ్తాయా? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారాయి. బట్‌ అఖిల్‌ వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు అటు ఫిల్మ్ నగర్‌లో, ఇటు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అవుతున్నాయి. 

ఇదిలా ఉంటే `ఏజెంట్‌` చిత్రానికి పెద్దగా బజ్‌ రావడం లేదు. పైగా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ కూడా ఆశించిన స్థాయిలో లేదని టాక్‌. దీనికితోడు ఈ సినిమాకి ఎనబై కోట్లు బడ్జెట్‌ పెట్టారని సమాచారం. ముందుగా పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ సినిమా పూర్తి కాకపోవడంతో దాన్ని వెనక్కి తీసుకున్నారు. సినిమా షూటింగ్‌ గత వారం వరకు జరిగింది. ఇంకా ఫైనల్‌ మిక్సింగ్ వర్క్ జరుగుతుందట. ఈ నేపథ్యంలో ప్రింట్‌ రెడీ కాకపోవడంతో పాన్‌ ఇండియా రిలీజ్‌ని వెనక్కి తీసుకున్నారని తెలుస్తుంది. ఈ సినిమాని కేవలం తెలుగులోనే విడుదల చేయనున్నట్టు తెలిపింది యూనిట్‌. ఇంట గెలిచి రచ్చ గెలవాలని, అందుకే తెలుగులోనే రిలీజ్‌ చేస్తున్నామని, పాజిటివ్‌ టాక్‌ వస్తే మిగిలిన భాషల్లో రిలీజ్‌ చేస్తామన్నారు అఖిల్‌. అయితే ఈ సినిమాని పాన్‌ ఇండియా రేంజ్‌ లో రిలీజ్‌ చేయాలనుకుని భారీగా పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు తెలుగుకే పరిమితం కావడంతో నిర్మాతల్లోనూ ఆందోళన నెలకొందని సమాచారం.