తెలుగు మీడియాలో ఈ మధ్య కమ్మ కులం వారి 'ఆంథెమ్' హాట్ టాపిక్ అయింది. ప్రముఖ టీవీ ఛానల్స్ ఈ సాంగుపై చర్చా కార్యక్రమాలు కూడా నిర్వహించాయి. కులాన్ని, మతాన్ని, దేవుడు అంతా మనం సృష్టించుకున్నవే అని వాదించే బాబు గోగినేని లాంటి హేతువాదులు ఈ చర్చా వేదికల్లో పాల్గొని.... 'కమ్మ కులానికి ఏమైనా ప్రత్యేక రక్తం ఉందా' అంటూ ప్రశ్నలు సంధించారు. అందరి రక్తం ఒకటే, కావాలంటే డిఎన్ఏ టెస్టు చేసి నిరూపిస్తాం... ఇలా కులాలు, మతాల పేరుతో ప్రజలను వేరుగా చూడొద్దు అని కొందరు వాదించారు.

కమ్మ ఆంథెమ్ పేరుతో విడుదలైన ఆ పాటలో ఎన్టీఆర్‌, ఏఎన్ఆర్‌తో సహా కమ్మ కులానికి చెందిన సినీ హీరోలు, పారిశ్రామిక వేత్తలు, ప్రముఖలు, సామాజిక వేత్తల గురించి గొప్పగా కీర్తించారు. ఈ పాట కేవలం మా కులం గురించి గొప్పగా చెప్పుకోవడానికే తప్ప ఇతర కులాలను తక్కువ చేయడానికి కాదు అని ఆ పాటను రూపొందించిన వారి వాదన.

ప్రముఖ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూడా కమ్మ కులానికి చెందిన వాడే కావడంతో.... ఇటీవల ఓ జర్నలిస్టు కమ్మ సాంగు గురించి ఆయన్ను ప్రశ్నించారు. మోహన్ బాబు గారు... మీకు కమ్మ క్యాస్ట్ ఫీలింగ్ ఉందా? కమ్మ సాంగులో మీ పేరు కూడా ఉండటంపై మీ అభిప్రాయం ఏమిటి? అంటూ ప్రశ్నించారు.

జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు మోహన్ బాబు సమాధానం ఇస్తూ... నాకు అలాంటి ఫీలింగ్ ఏమీ లేదు అని స్పష్టం చేశారు. దాంతో పాటు కొన్ని బలమైన ఆధారాలు కూడా ఆయన ఈ సందర్భంగా వివరించే ప్రయత్నం చేశారు.

నా గురువు దాసరి నారాయణరావుగారు కాపు కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. ఆయన బ్లెస్సింగ్స్ లేకుంటే ఈ రోజు నేను ఈ పొజిషన్లో ఉండేవాడిని కాదు.... అని మోహన్ బాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మోహన్ బాబు మరో ఉదాహరణ చెబుతూ.... తన కూతురు మంచు లక్ష్మి బ్రాహ్మిణ్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని పెళ్లాడిన విషాయాన్ని గుర్తు చేశారు. తనకు ఎలాంటి కాస్ట్ ఫీలింగ్ లేదన్నారు.

మీ కులాన్ని మీరు అభిమానించడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ మీ కులం మాత్రమే గొప్పది అని చెప్పుకోవడం తప్పు. తాను కమ్మ ఆంథెమ్ చూడలేదని మోహన్ బాబు ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.