Asianet News TeluguAsianet News Telugu

నేను మూసుకొని పోయేరకం కాదు.. వివాదాలపై విశ్వక్‌ సేన్‌ కామెంట్‌.. అంతటి కర్మ పట్టలేదంటూ వ్యాఖ్య..

యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ చుట్టూ తరచూ వివాదాలు చుట్టుముడుతుంటాయి. కొందరు ఆయన కావాలని చేస్తున్నారని అంటుంటారు. మరి తన అభిప్రాయం ఏంటి? అనేది విశ్వక్‌ సేన్‌ తెలిపారు. వివాదాలపై స్పందించారు.

i am not the type to shut up vishwak sen strong counter on controversies
Author
First Published Mar 21, 2023, 7:09 PM IST

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో మెయిన్‌ పాయింట్‌గా నిలుస్తున్నాడు. ఆయన యాటిట్యూడ్‌, కామెంట్లు చర్చనీయాంశంగా మారుతున్నాయి. మరోవైపు ఆయన సినిమాల రిలీజ్‌కి ముందు కాంట్రవర్సీలు కామన్‌గా మారుతున్నాయి. తాజాగా దీనిపై స్పందించారు విశ్వక్‌ సేన్‌. ప్రస్తుతం ఆయన హీరోగా నటించిన చిత్రం `దాస్‌ కా ధమ్కీ` రేపు బుధవారం(మార్చి 22)న విడుదల కాబోతుంది. ఉగాది స్పెషల్‌గా ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా తనకెదురైన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. 

అందులో భాగంగా వివాదాలకు సంబంధించిన వచ్చిన ప్రశ్నకి విశ్వక్‌ సేన్‌ స్పందించారు. `నాకు బ్యాక్‌ గ్రౌండ్‌ ఎవరూ లేదు. నన్ను నేనే ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకొచ్చిన గొడవరా అని మూసుకునిపోతే మూడు నాలుగు వివాదాలు జరిగేవి కావు. నామీదికి వస్తే నేను ప్రశ్నిస్తా, నేను ఎదురు మాట్లాడతా. ఎందుకంటే నన్ను ఎవరూ ప్రొటెక్ట్ చేయరు. నన్ను నేనే ప్రొటెక్ట్ చేసుకోవాలి. తుడుచుకొని పోతే కాంట్రవర్సీలు కావు. ఒక్కడినే వచ్చాను కాబట్టి రాళ్లు వేస్తారు. పది మంది ఉన్న వాళ్లపై రాళ్లు వేయరు. ఒంటరి వాడిపైనే రాళ్లు విసురుతుంటారు. వాటికి నేను ఆన్సర్‌ చెబుతా కాబట్టి వివాదం అవుతుంది. తూడుచుకుని పోతే వివాదం కాదు, నేను తూడుచుకుని పోయే రకం కాదు.

అదే సమయంలో వివాదాలు సృష్టించుకునేంత కర్మ నాకు లేదు. చాలా మంచి సినిమాలు చేస్తున్నా, వాటిని ఆడియెన్స్ చూస్తున్నారు. కాంట్రవర్సీలు చేశానని `అశోకవనంలో అర్జున కళ్యాణం` సినిమాకి ఓపెనింగ్‌ రాలేదు. బాగుందనేటాక్‌ వచ్చాకనే మ్యాట్నీ నుంచి ఓపెనింగ్స్ వచ్చాయి. వివాదం అయ్యిందనే ఆడియెన్స్ రాలేదు` అని తెలిపారు విశ్వక్‌ సేన్‌. ఇక తన సినిమా ప్రమోషన్లకి ఎన్టీఆర్‌, బాలయ్య, రామ్‌చరణ్‌ వంటి పెద్ద హీరోల సపోర్ట్ పై స్పందిస్తూ, నేను బేసిక్‌ గా నామూషి మనిషిని. అడిగితే వస్తారా?రారా? రాకపోతే బాధగా ఉంటుందేమో అనుకునేవాడిని. నన్ను అర్థం చేసుకున్న వాళ్లు వస్తారనే నమ్మకం వచ్చాక అడిగాను, ఎన్టీఆర్ అన్నా కావచ్చు, రామ్‌చరణ్‌ కావచ్చు, మిగిలిన హీరోలు కూడా నేను అడిగినది ఎప్పుడూ కాదనలేదు. అందరం కలిసి ఉంటాం, సపోర్ట్ చేసుకుంటామనేదానికి మిగిలిన ఇండస్ట్రీల వారికి కూడా ఇదొక ఉదాహరణగా చెప్పొచ్చు. అయితే పెద్ద స్టార్లు సపోర్ట్ చేయడం అనేది బ్లెస్సింగ్స్ గా భావిస్తున్నా` అని చెప్పిన విశ్వక్‌ సేన్‌ ఈ కల్చర్‌ ఉంటేనే చాలా బాగుంటుందన్నారు. 

`ధమ్కీ` సినిమా గురించి మాట్లాడుతూ, ఇది ఒక్క సినిమానే అయినా ఇందులో రెండు సినిమాలు కనిపిస్తాయన్నారు. ఆడియెన్స్ ఇంటికెళ్లాక కూడా ఎంజాయ్‌ చేశామనే ఫీలింగ్‌ కలుగుతుందన్నారు. సినిమా పట్ల చాలా నమ్మకంతో ఉన్నామని చెప్పారు. వ్యక్తిగతంగాఈ చిత్రం తనకు చాలా ముఖ్యమైనదని, దీనికోసం చాలా ఎఫర్ట్స్ పెట్టామని తెలిపారు. ఈ సినిమా ఆడితే నన్ను నేను నిరూపించుకున్న వాడిని అవుతానని తెలిపారు. విశ్వక్‌ సేన్‌ ద్విపాత్రాభినయం చేస్తూ దర్శకత్వం వహించిన `ధమ్కీ` చిత్రంలో నివేతా పేతురాజ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. హైపర్‌ ఆది, రంగస్థలం మహేష్‌ వంటి వారు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా రేపు ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios