సెలబ్రిటీలు అకౌంట్లను హ్యాక్ చేయడం, వారి పేరుతో ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేస్తుండడం జరుగుతూనే ఉంది. మిలియన్ల కొద్దీ ఫాలోవర్లువచ్చే అవకాశం ఉండడంతో కొందరు ఆకతాయిలు సెలబ్రిటీల పేర్ల మీద ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేస్తూ వారికి తలనొప్పిగా మారారు.

తాజాగా సీనియర్ హీరో నాగార్జున కూడా ఇలాంటి సంఘటనను ఎదుర్కొన్నాడు. నాగ్ కి ట్విట్టర్, ఫేస్ బుక్ లలో మాత్రమే ఖాతాలున్నాయి. ట్విట్టర్ లో ఆయన్ని ఆరు మిలియన్ల మంది ఫాలో అవుతుండగా.. ఫేస్ బుక్ లో రెండు మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

తన సినిమాలకు సంబంధించిన విశేషాలను పంచుకోవడం పాటు అప్పుడప్పుడు ఫ్యామిలీ పిక్స్ ని కూడా షేర్ చేస్తుంటాడు. నాగ్ పాపులారిటీ గమనించిన ఓ ఆకతాయి నాగార్జున పేరుతో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేశాడు. అందులో నాగ్ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఈ అకౌంట్ నాగార్జునదే అనుకున్న ఆయన అభిమానులు వెంటనే ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. 

ఫాలోవర్లు పెరుగుతుండడంతో విషయం నాగార్జున దృష్టికి వెళ్లింది. వెంటనే ఆయన తన ట్విట్టర్ అకౌంట్ లో తను ఇన్స్టాగ్రామ్ ఖాతా ఓపెన్ చేయలేదని.. తన పేరుతో ఉన్న ఇన్స్టా అకౌంట్ తనది కాదని స్పష్టం చేశారు. ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చినప్పుడు అందరికీ తెలియబరుస్తానని చెప్పారు. ప్రస్తుతం ఈ హీరో 'మన్మథుడు 2' సినిమాలో నటిస్తున్నాడు.