నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో హీరో నాగ చైతన్య కారుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఫైన్ విధించారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya)కారుకు జరిమానా విధించారు. నిబంధనలకు విరుద్ధంగా నాగ చైతన్య ప్రయాణిస్తున్న కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉంది. కారులో ప్రయాణించే వ్యక్తులు కనిపించకుండా అద్దాలకు అడ్డుగా ఉండే బ్లాక్ ఫిల్మ్ వాడకాన్ని చాలా కాలం క్రితమే నిషేధించారు. అయినప్పటికీ కొందరు తమ కార్లకు బ్లాక్ ఫిల్మ్ వాడుతున్నారు. నాగ చైతన్య కారుకు బ్లాక్ ఫిల్మ్ ఉండటాన్ని గమనించిన పోలీసులు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద ఆపారు.
నిబంధలకు విరుద్ధంగా బ్లాక్ ఫిల్మ్ (Black film) కలిగి ఉన్న నేపథ్యంలో రూ. 700 జరిమానా విధించారు. అలాగే అద్దాలకున్న బ్లాక్ ఫిల్మ్ తొలగించారు.జరిమానా చెల్లించిన అనంతరం చైతన్య అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇటీవల దర్శకుడు త్రివిక్రమ్ సైతం ఇదే కేసులో జరిమానా చెల్లించారు. ఆయన కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ గమనించిన పోలీసులు ఫైన్ విధించడం జరిగింది. నేరాలను అరికట్టే క్రమంలో బ్లాక్ ఫిల్మ్ వాడకం నిషేదించారు. కొందరు సెలెబ్రిటీలు మాత్రం పబ్లిక్ లో కనిపిస్తే ఎదురయ్యే ఇబ్బందుల రీత్యా.. బ్లాక్ ఫిల్మ్ ఇంకా వాడుతున్నారు.
ఇక లవ్ స్టోరీ విజయంతో జోరుమీదున్న నాగ చైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ మూవీ చేస్తున్నారు. ఈ మూవీలో నాగ చైతన్యకు జంటగా రాశి ఖన్నా నటిస్తున్నారు. అలాగే అమిర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న లాల్ సింగ్ చద్దా మూవీలో కీలక రోల్ చేస్తున్నారు. ఇటీవలే తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో బైలింగ్వల్ మూవీ ప్రకటించగా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. త్వరలో డిజిటల్ ఎంట్రీ కూడా ఇవ్వనున్నారు. ఆయన హీరోగా దూత పేరుతో సిరీస్ తెరకెక్కుతుంది.
