అజ్ఙాతవాసి సినిమా తరువాత పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్ సినిమాలకు దూరమయ్యాడు. ప్రత్యక్ష రాజకీయాలతో బిజీగా కావటంతో సినిమాలకు దూరమయ్యాడు పవన్‌. ఒక దశలో ఇక సినిమాలకు గుడ్‌ బై చెప్పినట్టే అని కూడా భావించారు. కానీ రాజకీయాల్లో దారుణమైన రిజల్ట్ రావటంతో పవన్ తిరిగి సినిమాల మీద దృష్టి పెట్టాడు. తనకు ఆర్ధికంగా ఉన్న ఇబ్బందుల నుంచి బయట పడేందుకు సినిమాలు చేయటమే మార్గమని చెప్పాడు పవన్‌.

హిందీలో సూపర్‌ హిట్ పింక్‌ సినిమాను తెలుగులో వకీల్ సాబ్‌ పేరుతో పవన్‌ రీమేక్‌ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తయ్యింది. మరి కొద్ది రోజుల్లో షూటింగ్ ముగుస్తుందనుకుంటున్న సమయంలో లాక్‌ డౌన్‌ రావటంతో సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఈపాటికే సినిమా రిలీజ్‌ కావాల్సి ఉన్నా షూటింగ్ పూర్తి కాకపోవటంతో వాయిదా పడింది.

అయితే ఇటీవల ప్రభుత్వం షూటింగ్‌లకు తిరిగి అనుమతి ఇవ్వటంతో షూటింగ్ తిరిగి ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. వీలైనంత తర్వగా షూటింగ్ పూర్తి చేసేందుకు స్కెచ్‌ వేస్తున్నారు, ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు పవన్‌. ఈ రెండు సినిమాలకు సంబంధించిన సెట్స్‌ను అల్యూమినియ్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేశారు.

అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలతో క్రిష్ సినిమా కోసం వేసిన సెట్‌ బాగా దెబ్బతిందట. ఏ మాత్రం ఉపయోగించటానికి వీల్లేని విధంగా సెట్‌ తడిసిపోవటంతో దాదాపు కోటి రూపాయల వరకు నష్టం వచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో చిత్రయూనిట్‌ తిరిగి సెట్‌ను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ పని పూర్తయిన వెంటనే షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు పవర్ స్టార్‌.