టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్యకు హైదరాబాద్ పోలిసుల నుంచి ఊహించని షాక్ ఎదురైంది. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నాగ శౌర్యకు పోలీసులు జరిమానా విధించారు. మంగళవారం రోజు నాగశౌర్య ప్రయాణిస్తున్న కారుకు బ్లాక్ ఫిల్మ్ ఉండడాన్ని పోలీసులు గమనించారు. 

దీనితో పంజాగుట్ట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రవి నాగ శౌర్యకు రూ 500 ఫైన్ విధించారు. అనంతరం కారుకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ ని తొలగించారు. ఈ సంఘటన బంజారా హిల్స్ రోడ్ నెం 1 లో జరిగింది. ఇండియాలో వాహనాలకు బ్లాక్ ఫిల్మ్ ఉపయోగించడం నిషేధం. సుప్రీం నిబంధన 2012 ప్రకారం ఈ నేరం కింద జరిమానా విధిస్తారు. 

కొన్నిరోజుల క్రితమే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి చెందిన వాహనానికి కూడా బ్లాక్ ఫిల్మ్ ఉండడంతో పోలీసులు జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాగ శౌర్య పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవల నాగశౌర్య ఓ బేబీ చిత్రంలో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది.