టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో భారీ క్రేజ్ తెచ్చుకున్న సినిమా 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. విడుదలకు ముందు ఈ సినిమా సృష్టిస్తోన్న ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు. ఈ సినిమా రైట్స్ దక్కించుకోవడం కోసం చాలా మంది ప్రయత్నిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా సినిమా రైట్స్ దక్కించుకోవడం కోసం ఓ సంస్థ రూ.8 కోట్లు ఆఫర్ చేసింది. అయితే తాజాగా ఈ సినిమాకి మరో భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ముంబైకి చెందిన ఎంహెచ్ స్టూడియోస్ అనే పార్టీ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాని అవుట్ రేట్ టోటల్ రైట్స్ తీసుకుంటామని ముందుకు వచ్చింది.

వాళ్లు ఎంత ఆఫర్ చేశారనే విషయాన్ని బయటకి రానివ్వలేదు. ఇప్పుడు దీనికి సంబంధించిన చర్చల కోసం వర్మ ముంబైకి వెళ్లారు. ఈరోజు డీల్ ఫైనల్ చేసుకొని హైదరాబాద్ కి తిరిగొస్తారు. రెండు రోజుల్లో సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయిన తరువాత అగ్రిమెంట్ ఉండే అవకాశాలు ఉన్నాయి.

విడుదలైన తరువాత ఈ సినిమాను ఎంతమంది ఆదరిస్తారో కానీ.. సినిమాకి ఓపెనింగ్స్ మాత్రం ఓ రేంజ్ లో ఉండబోతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం థియేటర్లలో సరైన సినిమాలు లేకపోవడం కూడా 'లక్ష్మీస్ ఎన్టీఆర్'కి కలిసొస్తోంది.