మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదల చేసిన టీజర్ తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. చాలా కాలం తర్వాత చిరంజీవి నటించిన ఈ చిత్రం హిందీలో కూడా విడుదల కానుంది. కాగా సైరా చిత్రం హిందీలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన వార్ చిత్రం నుంచి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

ఈ రెండు చిత్రాలు అక్టోబర్ 2నే రిలీజ్ అవుతున్నాయి. దీనితో హృతిక్ రోషన్ చిత్రాన్ని సైరా తట్టుకుని నిలబడుతుందా అనే ఆసక్తికర చర్చ అభిమానుల్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో హృతిక్ రోషన్ గతంలో చిరంజీవి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరంజీవిని హృతిక్ ప్రశంసల్లో ముంచెత్తిన వీడియో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. 

నా జీవితంలో చాలా సందర్భాల్లో చిరంజీవి సర్ ని కలుసుకున్నా. ఆయన అద్భుతమైన నటుడు. ఓ సందర్భంలో ఆయన మంచితనం ఏంటో తెలిసింది. ఐఫా పార్టీకి చాలా మంది దిగ్గజ నటులు, సెలెబ్రిటీలు వచ్చారు. నేను కూడా ఉన్నాను. ఆ సమయంలో చిరు సర్ స్వయంగా అక్కడున్నవారికి భోజనం వడ్డించారు. అదిచూసి నేను ఆశ్చర్యపోయా అని హృతిక్ రోషన్ తెలిపాడు. 

హృతిక్ నటించిన వార్ చిత్రం యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక చిరంజీవి నటించిన సైరా.. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది.